Tollywood: సాధారణంగా పండుగ వచ్చిందంటే.. కుటుంబాలు బంధువులతో, పిల్లతో కళకళలాడుతూ ఉంటాయి. ఇంకోపక్క సినీ అభిమానులకు పండుగ వచ్చిందంటే.. చాలు. కొత్త సినిమాల అప్డేట్స్, పోస్టర్స్, హీరోల కొత్త కొత్త ఫొటోలతో కళకళలాడుతుండేవి. కానీ, ఈ ఏడాది మాత్రం ఆ సందడి ఎక్కడ కనిపించడం లేదు. ఒక్కరంటే ఒక్కరైనా ఒక అప్డేట్ ఇచ్చినవారు లేరు.. పుష్ప 2, ఎన్టీఆర్ 30, హరిహరవీరమల్లు, సలార్.. ఇలా ఈ ఏడాది వచ్చే ఏ సినిమా గురించి కూడా అభిమానులకు ఒక అప్డేట్ ఇచ్చింది లేదు. కనీసం చాలామంది హీరోలు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పింది కూడా లేదు. దీంతో సినిమా అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి అంటే తెలుగువారి పెద్ద పండుగ.. సినిమావారికి ఎంతో ముఖ్యమైన పండుగ. కానీ, ఈరోజును ఇంత చప్పగా జరుపుకోవడం బాగోలేదని అభిమానులు చెప్పుకొస్తున్నారు. కనీసం నార్మల్ పోస్టర్స్ కూడా రిలీజ్ చేయలేనంత బిజీలో మేకర్స్ ఉన్నారా..? అను అభిమానులు మండిపడుతున్నారు.
ఇక గుడ్డిలో మెల్ల అన్నట్లు కొన్ని కొన్ని పోస్టర్స్, అప్డేట్స్ మాత్రం అభిమానులను అలరిస్తున్నాయి. అందులో ముఖ్యంగా ఆహా వారు రిలీజ్ చేసిన పవన్- బాలయ్య ఎపిసోడ్ ఫస్ట్ గ్లింప్స్. సినిమాతో కాకపోయినా షో ద్వారా అయినా పవన్ ను చూసినందుకు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక గత మూడు రోజుల నుంచి చిరంజీవి, బాలకృష్ణ ఎలాగూ కనిపిస్తూనే ఉన్నారు. వీరితో పాటు గోల్డెన్ గోల్బ్స్ అవార్డు పుణ్యమా అని ఆర్ఆర్ఆర్ చిత్ర బృందాన్ని కూడా సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. కానీ, మొత్తం సంక్రాంతి జోరు అయితే లేదని తెలిసిపోతోంది. కనీసం రేపు కనుమ రోజునైనా ఏమైనా అప్డేట్స్ ఇస్తారేమో చూడాలి.