సినిమా తారల ప్రచారంతో పబ్బం గడుపుకోవచ్చుననే సంస్థలు బోలెడున్నాయి. ఒకప్పటి కంటే ఇప్పుడు మన తెలుగు సినిమా తారలు సైతం పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్స్ గా పనిచేస్తూ, బాగానే వెనకేసుకుంటున్నారు. ఇది జగద్విదితం. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘ర్యాపిడో’ బైక్స్ ప్రచార చిత్రంలో నటించేసి టి.ఎస్.ఆర్.టి.సి. ఎమ్.డి సజ్జనార్ నుండి నోటీసులు అందుకున్నారు. అల్లు అర్జున్ నటించిన ‘ర్యాపిడో బైక్ యాడ్’లో టి.ఎస్.ఆర్.టి.సి.ని కించపరిచే విధంగా మాట్లాడారన్నది అభియోగం. ఈ నేపథ్యంలో ర్యాపిడో సంస్థకు, యాడ్ చేసిన బన్నీకి నోటీసులు జారీ చేశారు. ప్రచారంతో ప్రమోదం కలిగించబోయి ఎదురు దెబ్బ తిన్నవారు గతంలోనూ ఉన్నారు.
కొన్నేళ్ళ క్రితం చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు కొన్ని శీతల పానీయాల ప్రచార కర్తలుగా నటించారు. ఆ సమయంలో సదరు కూల్ డ్రింక్స్ లో పెస్టిసైడ్స్ కలుపుతున్నారనే ప్రచారం సాగటం… ఆ శీతల పానీయాలు తాగరాదని ప్రభుత్వం ఉత్తర్వులూ జారీ చేయటం జరిగింది. దాంతో ఆ పానీయాల్లో ఏలాంటి పెస్టిసైడ్స్ కలపలేదని సంస్థలు నిరూపించుకోవలసి వచ్చింది. ఇక్కడ మన తారలు ఓ విషయం తప్పకుండా గుర్తుంచుకోవలసి ఉంది. ఆయా తారలపై జనానికి ప్రత్యేకమైన అభిమానం ఉంది. సినీస్టార్స్ చెబితే ‘ఓకే’ అనుకొనే అమాయక జనం ఇప్పటికీ ఉన్నారు. అది గమనించే సినిమా తారలకు కోట్లు ఇచ్చి తమ ప్రాడక్ట్స్ ప్రచారంలో నటించమని పలు సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. తారలు వెనుక, ముందు చూసుకోకుండా నటించేస్తున్నారు.
ఎవరు బాధ్యులు?
గతంలో మన తారలు ప్రచారం చేసిన ప్రాడక్ట్ కొనుగోలు చేసిన వినయోగదారులు… వారిపైనా, కంపెనీపైనా వినియోగదారుల సంఘంలో కేసులు వేసిన దాఖలాలున్నాయి. ప్రస్తుతం మన తారల్లో చాలామంది పలు కంపెనీల ప్రచార చిత్రాల్లో నటించేస్తున్నారు. షో రూమ్ యాడ్స్ లో ఎంతోమంది తారలు మెరుస్తున్నారు. వారిని చూసి, సదరు షో రూమ్ లో ఎవరైనా కొనుగోలు చేసి, ఇబ్బందుల పాలయితే, అందుకు ప్రకటనలో నటించిన తారలు బాధ్యత వహిస్తారా? ముఖ్యంగా బంగారు నగల దుకాణాలకు, బంగారు తాకట్టు పెట్టుకొనే సంస్థలకు మన స్టార్స్ లో కొందరు ప్రచార సారథులు. వారు చెప్పే మాటలు విని సదరు గోల్డ్ షాప్స్ లో కొనుగోలు చేస్తే, తగిన మజూరీ లేకపోతే, కొనుగోలుదారులు మోసపోయినట్టే కదా! అదే విధంగా బంగారం పెట్టి, లోన్ తీసుకొనే చోట కూడా ఏదైనా మోసం జరిగితే, తారలు బాధ్యత వహిస్తారా?
తేడా గమనించండి!
మరో ముఖ్య అంశం, ఈ మధ్య మన తారల్లో కొందరు రియల్ ఎస్టేట్ రంగంలోని కంపెనీలకు ప్రచారం చేస్తూ వస్తున్నారు. వారిని చూసి, లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన వారికి, రేపు ఏదైనా నష్టం జరిగితే, సదరు తారలు భరిస్తారా? “మేం నటులం. సినిమాల్లో ఎలా నటిస్తామో, ఇక్కడ కూడా పారితోషికం తీసుకొని నటిస్తాం. కాబట్టి, మాకు సినిమా రిజల్ట్ లో ఎలా సంబంధం ఉండదో, అదే తీరున ఈ ప్రకటనల విషయంలోనూ ఏమీ సంబంధం ఉండదు అని కొందరు తారలు చెబుతుంటారు. సినిమాలో ఓ పాత్రలో నటించడానికి రెమ్యూనరేషన్ పుచ్చుకుంటారు. సినిమాలను ప్రేక్షకులు డబ్బులు ఇచ్చి మరీ చూసి ఆనందిస్తుంటారు. ఇక్కడ అలా కాదు, వారి చెంతకు మీరే ప్రకటనలను తీసుకు వెళ్తున్నారు. మీరు నటించిన ప్రకటనలు జనం ఏమీ అదనంగా చెల్లించడం లేదు. కేవలం మీ మాటలు నమ్మి మీ పై నమ్మకంతో కొనుగోలు చేయడం కానీ, పెట్టుబడులు పెట్టడం కానీ చేస్తారు. ఈ కోణంలో
ఆలోచిస్తే, సినిమాల్లో నటించడానికి, యాడ్స్ లో కనిపించడానికి తేడా ఏమిటో అర్థం అవుతుంది.
ఆలోచించాల్సిందే..
ఏది ఏమైనా, తారలు నటించే ప్రకటనల కారణంగా కొందరైనా ప్రభావితం అవుతూ ఉంటారు. అందుకే వీరికి కోట్ల పారితోషికం ఇచ్చి ప్రచారం చేయమని సంస్థలు కోరుతుంటాయి. ఇక ముందయినా, తారలు తాము నటించే ప్రాడక్ట్ ఏంటి? దాని వల్ల ప్రజలకు కలిగే ప్రయోజనం ఏమిటి? జనాలకు ఏమైనా నష్టం వాటిల్లే అవకాశం ఉందా? అన్న కోణాల్లో ఆలోచించాలి. లేదంటే మిమ్మల్ని ఎంతగానో అభిమానించే అమాయకజనాన్ని మీరు మోసగించినట్టే అవుతుంది. ఉదాహరణకు సౌందర్య సాధనలయినా ఫేస్ క్రీమ్స్, సోప్స్ వంటి యాడ్స్ లో నటించారనుకోండి. నిజంగా వాటిని మీరు ఉపయోగిస్తారా? లేదా? అన్నది ముందు ఆలోచించండి. కొన్ని కాస్మెటిక్స్ కొంతమంద సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారికి సరిపడవు. అలాంటప్పుడు, మీ యాడ్ చూసి క్రీమ్స్ కొనుగోలు చేసి, లేనిపోని సమస్యలు తెచ్చుకుంటే,
వారి అందవికారానికి మీరు బాధ్యత వహిస్తారా? అలా జరిగిన పక్షంలో సదరు వినియోగదారునికి, ఆ సంస్థపై, తనకు నమ్మకం కలిగించిన తారలపై కేసు వేసే హక్కు తప్పకుండా ఉంటుంది.
ఎవరెవరు ఏం చేస్తున్నారు?
ఇంతకూ మన తారల్లో ఎవరెవరు ఏ బ్రాండ్స్ కు అంబాసిడర్స్ గా సాగుతున్నారో ఓ సారి చూద్దాం. అందరి కన్నా మిన్నగా కొన్ని సంవత్సరాల నుంచీ మహేశ్ బాబు ప్రకటనల్లో నటించేస్తూ కోట్లు గడించారు. ఆయన “థమ్స్ అప్, సంతూర్ సోప్, శ్రీ సూర్య డెవలపర్స్, అభి బస్, హంబుల్ కో, బైజూస్, ఫ్లిప్ కార్ట్, క్లోజప్” సంస్థలకు ప్రచారసారథిగా ఉన్నారు. నాగార్జున ‘కళ్యాణ్ జువెలర్స్’కు బ్రాండ్ అంబాసిడర్. ఆయన తనయుడు నాగచైతన్య “బిగ్ బజార్, చెన్నై షాపింగ్ మాల్” వంటి వస్త్రదుకాణాల ప్రచార చిత్రాల్లో నటిస్తున్నారు. అల్లు అర్జున్ విషయానికి వస్తే – “7 అప్, రెడ్ బస్, ఫ్రూటీ, ర్యాపిడో” సంస్థల ప్రచార చిత్రాల్లో నటించారు. రామ్ చరణ్ “టాటా డొకొమో, హ్యాపీ మొబైల్స్” ప్రచారాల్లో పాలు పంచుకున్నారు. “మల్ బార్ గోల్డ్, నవరత్న హెయిర్ ఆయిల్” వంటి వాటికి జూనియర్ యన్టీఆర్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. ఆ మధ్య ఆయన కూడా ‘హ్యాపీ మొబైల్స్’ యాడ్ లో కనిపించారు. కొత్తగా ‘యాపీ ఫిజ్’కు కూడా జూనియర్ ప్రచారసారథి.
వెంకటేశ్ “ముత్తూట్ ఫైనాన్స్, వీకేసీ ప్రైడ్, రామ్ రాజ్ కాటన్స్, జాన్ డీర్ ట్రాక్టర్స్”కు బ్రాండ్ అంబాసిడర్. రానా దగ్గుబాటి దగ్గరకొస్తే “రాధా టిఎమ్.సి, రిలయన్స్ ట్రెండ్స్” వంటి సంస్థల ప్రచార చిత్రాల్లో కనిపించారు. వీరితో పాటు యంగ్ హీరో విజయ్ దేవర కొండ సైతం కొన్ని ప్రకటనలలో హల్ చల్ చేస్తున్నారు. విజయ్ “సంగీత మొబైల్స్, కె.ఎల్.ఎమ్ షాపింగ్ మాల్, మిబాజ్, జొమాటో” యాడ్స్ లో అలరించారు.వీరే కాకుండా సమంత, కాజల్ తో పాటు మరి కొంతమంది హీరోయిన్స్ సైతం పలు ప్రాడక్ట్స్ కు అంబాసిడర్స్ గా కొనసాగుతున్నారు. ఏది ఏమైనా గతంలో కన్నా మిన్నగా సోషల్ మీడియా ద్వారా తారలు అభిమానులకు వెంటనే కనెక్ట్ అయిపోతున్నారు. వారు తాము నటించే చిత్రాల వివరాలతో పాటు, కనిపించిన యాడ్స్ విశేషాలు కూడా సామాజిక మాధ్యమాల్లో చొప్పించేస్తుంటారు. తమ అభిమాన తారలు ఓ కొత్త సినిమా అంగీకరించినా, కొత్త ప్రాజెక్ట్ కు ప్రచారకర్తగా మారినా సంతోషించే అమాయకపు అభిమానులు ఉంటారు. కొత్త సినిమా టిక్కెట్ కొనేసినట్టే, తారలు ప్రచారం చేసే ప్రాడక్ట్స్ కూడా కొనేస్తారు. కొనుగోలు చేసే ముందు జనం ఎంత జాగ్రత్తగా ఆలోచించాలో… యాడ్స్ లో నటించేముందు తారలు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఎంతయినా ఉంది.
కొసమెరుపు:
ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన ‘ర్యాపిడో’ యాడ్ పై టీ.ఎస్.ఆర్.టి.సి. ఎమ్.డి. సజ్జనార్ స్పందించి, అందులో నటించిన అల్లు అర్జున్ కు, కంపెనీకి నోటీసులు పంపారు. నిజానికి, ఆ యాడ్ లో కనిపించే బస్సు, దానిపై రాసి ఉన్న ఊళ్ళ పేర్లు చూస్తే అవి ఆంధ్రప్రదేశ్ లోని గోదావరి జిల్లాకు సంబంధించిన పేర్లుగా కనిపిస్తున్నాయి. తెలంగాణలోనూ అలాంటి పేరుతో ఊరు ఉంది. అయినా అసలే నష్టాల్లో ఉన్నటువంటి ఆర్టీసీకి ఈ ప్రకటన మరకపూసేదే. దీనిపై టీఆర్టీసీ ఎమ్.డి. స్పందించారు. మరి ఏపీఎస్ ఆర్టీసీ వారు ఎప్పుడు స్పందిస్తారో..