ఈ కాలంలో ప్రేమ కథలకు ఏ పేర్లు పెడుతున్నారో కానీ, ఒకప్పుడు సుఖాంత ప్రేమకథలను ‘పాతాళభైరవి'
తోనూ, విషాదాంత ప్రేమకథలను ‘దేవదాసు
‘ సినిమాతో్నూ పోల్చేవారు. తెలుగు చిత్రసీమలో అలా ప్రేమవ్యవహారాలు ఆ సినిమాలు వెలుగు చూడక ముందే చోటు చేసుకున్నాయి. దిగ్దర్శకుడు పి.పుల్లయ్య, నటి శాంతకుమారిని ప్రేమించి పెళ్ళాడారు.
అలాగే బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి, దర్శకుడు పి.రామకృష్ణను ప్రేమవివాహం చేసుకున్నారు. ఆ దంపతులు భావి సినీజనానికి ఆదర్శంగానూ నిలిచారు.
ఆ తరువాత తెలుగు సినిమా రంగంలో నటీనటులు వివాహం చేసుకొని పండంటి కాపురం సాగించినవారూ ఉన్నారు, ఇంకా ఆనందంగా జీవిస్తున్నవారూ ఉన్నారు. అలాంటి వారిలో ముందుగా గుర్తు చేసుకోవలసిన వారు కృష్ణ – విజయనిర్మల. ఈ దంపతులు నటులుగానే కాదు,నిర్మాతలు, దర్శకులుగానూ అలరించడం విశేషం!
ఆ తరం నటుడు రామకృష్ణ, నటి గీతాంజలిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నాగార్జున, నాటి అందాలతార అమలను వివాహమాడారు. వారి సంసారనౌక ఆనందసాగరంలో సాగుతూనే ఉంది. ఇక రాజశేఖర్-జీవిత జంట మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్న మాటకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు.
మహేశ్ బాబు తండ్రి బాటలోనే పయనిస్తూ తన సరసన నటించిన నమ్రతా శిరోద్కర్ ను జీవిత నాయికగా చేసుకున్నారు. శ్రీకాంత్ కూడా తన నాయిక ఊహను వివాహమాడారు. రాజీవ్ కనకాల, సుమ దంపతులు సైతం నటనలో రాణించిన వారే. నటుడు శివబాలాజీ, నటి మధుమిత ఆనందంగా సంసారం చేస్తున్నారు.
మరి కొందరు నటీనటుల సైతం ప్రేమ వివాహాలే చేసుకున్నారు. అయితే వారిలో కొందరు సినిమా రంగానికి చెందిన వారితోనే ఏడడుగులు నడిచారు. మరికొందరు ఇతరులను ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. వీరిలో అల్లు అర్జున్, రామ్ చరణ్, మంచు విష్ణు వంటి వారు చోటు సంపాదించారు. అల్లు అర్జున్, స్నేహారెడ్డిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. రామ్ చరణ్ తన చిన్ననాటి స్నేహితురాలు ఉపాసనను ప్రేమించే పెళ్ళాడారు. మంచు విష్ణు, వెరోనికాను ప్రేమించే మనువాడారు. మంచులక్ష్మి సైతం ప్రేమవివాహమే చేసుకున్నారు. ఆమె భర్త పేరు ఆండీ శ్రీనివాసన్. హీరో నాని కూడా ప్రేమకే ఓటేశారు. ఆయన భార్య పేరు అంజనా యలవర్తి. వరుణ్ సందేశ్ తన నాయిక వితికా షేరును ప్రేమ వివాహం చేసుకున్నారు. హీరో నందు గాయని గీతామాధురిని ప్రేమించి పెళ్ళాడారు.
ఇక గాయనీగాయకులు సైతం ప్రేమించి పెళ్ళి చేసుకున్నవారు ఉన్నారు .అలాంటి వారిలో ముందుగా గుర్తుకు వచ్చేది ఆ నాటి మేటి గాయనీగాయకులు జిక్కి ఆమె భర్త ఏ.ఎమ్.రాజా. తరువాతి కాలంలో గాయకునిగా తనదైన బాణీ పలికించిన రామకృష్ణ సైతం తనతో పాటలు పాడుతూ సాగిన జ్యోతిని వివాహమాడారు. ఇక గాయకుడు మల్లికార్జున్, గాయని గోపికా పూర్ణిమను పెళ్ళాడారు. మరో గాయకుడు హేమచంద్ర సైతం తన సహచర గాయని శ్రావణ భార్గవిని ప్రేమించి మనువాడారు. తరువాత గీత రచయిత చంద్రబోస్, నృత్య దర్శకురాలు సుచిత్రను ప్రేమ వివాహం చేసుకున్నారు.
ఇక దర్శకుల్లో ఆ కాలం వారిలోనే సి.యస్. రావు, నటి రాజసులోచనను ప్రేమించి పెళ్ళాడారు. దర్శకుడు కృష్ణవంశీ, నటి రమ్యకృష్ణ ప్రేమ వివాహం అందరికీ తెలిసిందే. ఈ నాటి మేటి దర్శకుడు రాజమౌళి కూడా రమను ప్రేమించే వివాహం చేసుకున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ సైతం సౌజన్యను ప్రేమించే మనువాడారు. పూరి జగన్నాథ్ కూడా లావణ్యను ప్రేమించే పెళ్ళాడారు. ఇక్కడ పేర్కొన్న తెలుగు సినిమా రంగంలోని జంటలే కాదు, మరెన్నో మన సినిమా రంగంలోని ప్రేమ జంటలు తమ కలలను సాకారం చేసుకొని ఆనందంగా సాగుతున్నారు.
పైన పేర్కొన్న జంటల ప్రేమ కథలన్నీ ఫలించి, సంసారనౌకలో ఆనందసాగరంలో తేలుతూ సాగుతున్నారు. కొందరిలో విభేదాలు చోటు చేసుకున్నా, అదంతా టీ కప్పులో తుఫాన్ లాంటివే. కానీ, పవన్ కళ్యాణ్ తన హీరోయిన్ రేణూ దేశాయ్ ని ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలు పుట్టాక ఆ జంట విడిపోయింది. ఈ మధ్యనే ఫేమస్ లవ్ బర్డ్స్ గా జేజేలు అందుకున్న నాగచైతన్య – సమంత వివాహం అయిన కొన్నాళ్ళకే విడిపోవడం విచారకరం. ఇక దర్శకుడు సూర్యకిరణ్, నటి కళ్యాణిని ప్రేమించే పెళ్ళాడారు. ప్రస్తుతం విడివిడిగా ఉంటున్నారు.
తెలుగు సినిమాల్లో అనేక ప్రేమకథల్లో చివరకు సుఖాంతాలే ఘనవిజయాలు సాధించాయి. అదే తీరున మన సినిమా రంగంలోని అనేక ప్రేమ పెళ్ళిళ్ళు ఆనందంగా సాగుతున్నాయి. విడిపోయిన వారిని చూస్తేనే అభిమానులకు మరింత విచారం. ఏది ఏమైనా చిత్రసీమలో ప్రేమయాత్రలన్నీ ఆనందతీరాలనే అధికంగా చూశాయి. ఈ నాటికీ ఆనందంగా జీవితనౌకను నడుపుతున్న ప్రేమజంటలందరికీ వాలెంటైన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ, వారందరూ కడదాకా సుఖసంతోషాలతో ఉండాలని ఆశిద్దాం. అలాగే ఇకపై ప్రేమవివాహాలు చేసుకొనే వారందరూ ఆనందంగా అనేక వసంతాలు చూస్తూ సాగాలనీ కోరుకుందాం.