తెలుగు చిత్రసీమలో వెలుగులు విరజిమ్మిన పరభాషా తారలు ఎందరో! వారిలో నాజూకు షోకులతో మురిపించిన వారు కొందరు. అలాంటి వారిలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించింది గోవా పాలకోవాగా అభిమానులచే జేజేలు అందుకున్న ఇలియానా. తెలుగు సినిమాలతోనే నటిగా ఇలియానా కెరీర్ ఆరంభమయింది. తరువాత ఏ భాషలో ఎంతగా వెలిగినా, ఇలియానా వెలుగులు తెలుగునాట ప్రసరించినంతగా ఎక్కడా ప్రభ చూపలేకపోయాయి.
ఇలియానా డిక్రూజ్ 1987 నవంబర్ 1న ముంబయ్ లో జన్మించింది. ఆమె తండ్రి కేథలిక్ క్రిస్టియన్, తల్లి ముస్లిమ్. ఇలియానా పదేళ్ళ వయసులో వారి కుటుంబం గోవాలోని పర్రా గ్రామం చేరుకుంది. ఇలియానా ర్యాంప్ షోస్ లో పాల్గొంటూ, తన నాజూకు షోకులతో మురిపించేది. తరువాత ‘ఎలక్ట్రోలాక్స్, ఇమామి’ యాడ్స్ లో తళుక్కున మెరిసింది. హిందీ చిత్రసీమలో అవకాశాల వేట ప్రారంభించిన సమయంలోనే ఇలియానాకు తెలుగు దర్శకుడు తేజ తన చిత్రంలో అవకాశమిచ్చారు.
అయితే ఆ సినిమా కొన్ని అనివార్య కారణాల వల్ల మొదలు కాలేదు. అదే సమయంలో తన ‘దేవదాస్’ నాయిక కోసం వేట సాగిస్తున్న వైవిఎస్ చౌదరి, ఆమెను ఎంపిక చేసుకున్నారు. అలా ‘దేవదాస్’ తొలిచిత్రమే ఘనవిజయం సాధించడంతో ఇలియానా తెలుగు కుర్రాళ్ళ మదిలో చోటు సంపాదించింది. తరువాత పూరి జగన్నాథ్ ‘పోకిరి’లో మహేశ్ బాబు సరసన మరింతగా మురిపించింది ఇలియానా.
ఆ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలచింది. ఆ రెండు చిత్రాల ఘనవిజయంతో ఇలియానా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఆమె కాల్ షీట్స్ కాస్ట్లీగా మారిపోయాయి. టాలీవుడ్ యంగ్ హీరోస్ అందరూ ఇలియానాతో జోడీ కట్టాలని ఉరకలు వేశారు. “ఖతర్నాక్, రాఖీ, మున్నా, ఆట, జల్సా, కిక్, రెచ్చిపో, సలీమ్, శక్తి, జులాయ్” వంటి చిత్రాలలో ఇలియానా అందం జనానికి గంధం పూసింది. కొన్ని తమిళ, కన్నడ చిత్రాలలోనూ ఇలియానా మత్తు చల్లింది.
ఇలియానా ఎన్నో రోజుల నుంచి కలలు కన్న బాలీవుడ్ ఎంట్రీ రణబీర్ కపూర్ ‘బర్ఫీ’తో లభించింది. ఈ తొలి హిందీ చిత్రంతోనే ఇలియానాకు బంపర్ హిట్ దక్కింది. ఆ తరువాత హిందీ చిత్రసీమలోనే రాణిస్తూ సాగింది. అయితే అక్కడ ఫ్లాపులు పలకరించగానే మళ్ళీ తెలుగు సినిమావైపు చూసింది. ఆ సమయంలో రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’లో తన ‘కిక్’ హీరోతో జోడీ కట్టింది ఇలియానా. అయితే ఆ సినిమా అంతగా అలరించలేదు. ఈ యేడాది అభిషేక్ బచ్చన్ తో కలసి ఇలియానా నటించిన ‘బిగ్ బుల్’ విడుదలయింది. అయితే కరోనా ప్యాండమిక్ కారణంగా థియేటర్లలో కాకుండా ఆ చిత్రం ‘హాట్ స్టార్’ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో విడుదలయింది. రణదీప్ హూడాతో కలసి ఇలియానా నటించిన ‘తేరా క్యా హోగా లవ్లీ’లో నటించింది. ఈ సినిమా విడుదల కావలసి ఉంది.
ఇలియానా ప్రేమాయణాలు సైతం జనాన్ని ఆకర్షించాయి. అయితే ఇలియానా సినిమాలు పరాజయాన్నే చవిచూశాయి. ఆ దశలో తన ఫోటో షూట్స్ తో మళ్ళీ కుర్రాళ్ళను పిచ్చోళ్ళను చేస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. అయినా, ఎందుకనో మునుపటిలా తెరపై ఇలియానా మురిపించలేకపోతోంది అనే మాటే వినిపిస్తోంది. ఏది ఏమైనా నాజూకు షోకుల సుందరి ఇలియానా ఈ నాటికీ ఎంతోమంది కలల రాణిగా కొనసాగుతూనే ఉండడం విశేషం!