టాలీవుడ్లో ఒక మాట తరచూ వినిపిస్తుంటుంది.. “దర్శకుడు ఎంతటి మొనగాడైనా, అతని జాతకాన్ని నిర్ణయించేది మాత్రం చివరి సినిమా రిజల్టే”. ఒక్క విజయం ఓవర్‌నైట్ స్టార్‌ని చేస్తే, ఒక్క అపజయం తదుపరి ప్రాజెక్టు పట్టాలెక్కకుండా ముచ్చెమటలు పట్టిస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్లో కొందరు క్రేజీ డైరెక్టర్లు సరిగ్గా ఇలాంటి డైలమాలోనే ఉన్నారు. చేతిలో పనిలేక, కొత్త సినిమాపై క్లారిటీ రాక సతమతమవుతున్న ఆ దర్శకులపై ఓ లుక్కేద్దాం.
Also Read:Shocking Discovery: నీళ్లు తాగకపోతే ఇంత ఘోరమా.? టీనేజర్ రిపోర్ట్ లో షాకింగ్ నిజాలు.!
బోయపాటి శ్రీను, మారుతి వంటి మాస్ అండ్ కమర్షియల్ డైరెక్టర్లకు కాలం ఇప్పుడు పరీక్ష పెడుతోంది. ‘అఖండ’తో ఊపు ఊపిన బోయపాటి, ఆ తర్వాత యంగ్ హీరోలతో చేసిన ప్రయోగాలు విఫలం కావడంతో డైలమాలో పడ్డారు. బాలయ్యతో ‘అఖండ 2’ తప్ప ఆయనతో పనిచేయడానికి ఇతర హీరోలు వెనకడుగు వేస్తున్నారు. అటు ‘రాజాసాబ్’తో విమర్శలు ఎదుర్కొన్న మారుతి పరిస్థితి మరింత వింతగా మారింది. సినిమా నచ్చకపోతే ఇంటికి రమ్మని ఆయన ఇచ్చిన పిలుపు రివర్స్ కొట్టి, ఫ్యాన్స్ నుంచి ‘క్యాష్ ఆన్ డెలివరీ’ ఆర్డర్ల రూపంలో నిరసనలు ఎదురవుతున్నాయి. దీంతో మారుతి మళ్లీ తన పాత పద్ధతిలో చిన్న సినిమాలకే పరిమితం అవుతారా అన్న చర్చ మొదలైంది.
మరోవైపు, సీక్వెల్స్ నమ్ముకున్న దర్శకులకు చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. విజయ్ దేవరకొండ – గౌతమ్ తిన్ననూరి కాంబోలో వచ్చిన ‘కింగ్డమ్’ ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో, ‘కింగ్డమ్ 2’ అటకెక్కింది. దీంతో గౌతమ్ తదుపరి అడుగుపై సందిగ్ధత నెలకొంది. ఇక క్రిష్ జాగర్లమూడి పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ‘ఘాటి’ ప్లాప్ తర్వాత బాలయ్య ‘ఆదిత్య 369’ సీక్వెల్‌పై ఆశలు పెట్టుకున్నా, ‘ఆదిత్య 999 మ్యాక్స్’ రద్దయిందన్న వార్తలు ఆయన్ని అయోమయంలో పడేశాయి. పెద్ద ప్రాజెక్టులు చేజారుతుండటంతో ఈ దర్శకుల కెరీర్ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
Also Read:Raveena Tandon: నా కూతురిలో ఆ నటి ఆత్మ.. స్టార్ హీరోయిన్ సంచలనం
వీరితో పాటు వరుస ఫ్లాపుల ఎఫెక్ట్ బొమ్మరిల్లు భాస్కర్, వెంకీ కుడుముల, పరశురామ్ వంటి వారిపై తీవ్రంగా పడింది. ‘జాక్’ డిజాస్టర్ తర్వాత భాస్కర్ ఫేడౌట్ అయ్యే స్థితికి చేరుకోగా, ‘రాబిన్ హుడ్’ దెబ్బకు వెంకీ కుడుముల మెగాఫోన్ పక్కన పెట్టి నిర్మాతగా అవతారమెత్తారు. ‘ఫ్యామిలీ స్టార్’ ఫలితంతో పరశురామ్ తదుపరి సినిమాపై నీలి నీడలు కమ్ముకున్నాయి. చివరకు శేఖర్ కమ్ముల లాంటి క్లాస్ డైరెక్టర్ కూడా ‘కుబేర’ తమిళ రిజల్ట్‌తో నాని ప్రాజెక్టు విషయంలో రకరకాల ప్రచారాలను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఏది ఏమైనా, సినిమా రంగంలో సక్సెస్ ఉంటేనే గౌరవం.. లేదంటే ఎంతటి మేధావులైనా మళ్ళీ ‘యాక్షన్’ చెప్పడానికి నిరీక్షించక తప్పదు.