తెలుగు సినీ నిర్మాతల మండలి ఆధ్వర్యంలో సోమవారం (జూన్ 13న) హైదరాబాద్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ హాల్ లో మధ్యాహ్నం 3.30కి కీలక సమావేశం జరుగబోతోంది. దీనికి సంబంధించి నిర్మాతల మండలి కార్యవర్గం ఓ ప్రకటన విడుదల చేసింది. తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలిలోని నిర్మాతలు, నిర్మాణంలో ఉన్న, నిర్మించబోతున్న నిర్మాతల సభ్యులకు ఈ సమావేశానికి ఆహ్వానం పంపారు. తెలుగు ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ వర్కర్స్ వేతనాల పెంపుదలతో పాటు కొంతకాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యలను గురించి ఈ సమావేశంలో చర్చించబోతున్నారు.
కరోనాకు ముందు ఫెడరేషన్ ఎంప్లాయిస్ వేతనాలను సవరించడం జరిగింది. అయితే గత రెండేళ్ళుగా కరోనా కారణంగా చిత్ర పరిశ్రమ కుదేలైంది. ఇప్పుడిప్పుడే తిరిగి కోలుకుంటోంది. ఈ సమయంలో పాత సమస్యలను కొన్ని తిరిగి వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా ఫైటర్స్ యూనియన్ తో కొంతకాలంగా నిర్మాతలు ఇబ్బందులు ఇబ్బందులు పడుతున్నారు. అలానే డాన్సర్స్ యూనియన్ తోనూ సమస్యలున్నాయి. యూనియన్ సభ్యులతోనే వర్క్ చేయించుకోవాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. పరాయి రాష్ట్రాలకు షూటింగ్ నిమిత్తం వెళ్ళినప్పుడు అక్కడి స్థానికులతో పనిచేయించడాన్ని ఈ యూనియన్లు ప్రశ్నిస్తున్నాయి. ఇదిలా ఉంటే కాంపిటీషన్ కమీషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) యూనియన్లతో సంబంధం లేకుండా అనుభవం ఉన్న ఎవరితో అయినా పని చేసుకునే స్వేచ్ఛను కలిపిస్తోంది. దాంతో బయటి వ్యక్తులతో పనిచేయించుకోవడంలో తప్పులేదని కొందరు నిర్మాతలు వాదిస్తున్నారు. దానిని యూనియన్లు అంగీకరించడం లేదు. ఇలాంటి సంక్లిష్ట సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే అంశాన్ని ఈ రోజు జరిగే సమావేశంలో ప్రధానంగా చర్చించబోతునట్టు తెలుస్తోంది.