చిత్రసీమలోకి అడుగుపెట్టిన ప్రతి రైటర్… ఎప్పుడో ఒకప్పుడు డైరెక్టర్ కావాలని కలలు కంటూ ఉంటాడు. అయితే కొందరి కలలు త్వరగా నెరవేరితే మరికొందరి కలలు నిజం కావడానికి చాలా కాలం పడుతుంది. పలు విజయవంతమైన చిత్రాలకు రచన చేసిన శ్రీధర్ సీపాన పరిస్థతి కూడా అదే. దాదాపు మూడు, నాలుగేళ్ళుగా దర్శకుడు కావాలనుకుంటున్న అతని కోరిక తీరకుండా వాయిదా పడుతూ వచ్చింది. ‘బృందావనమది అందరిదీ’తో దర్శకుడు కావాలని శ్రీధర్ అనుకున్నాడు. కానీ ఆ ప్రాజెక్ట్ పూర్తి కాలేదు. ఆ తర్వాత చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్ తో సినిమాచేసే ఛాన్స్ వచ్చింది. కానీ అదీ ముందుకు సాగలేదు. మొత్తం మీద ఇప్పుడు ‘వాంటెడ్ పండుగాడ్’ మూవీతో దర్శకుడిగా తొలిసారి జనం ముందుకు రాబోతున్నాడు. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు సమర్పణలో సాయిబాబా కోవెలమూడి, వెంకట్ కోవెలమూడి, జోసఫ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సునీల్, అనసూయ భరద్వాజ్, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, సుడిగాలి సుధీర్ ప్రధాన పాత్రధారులు పోషించారు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపుదిద్దుకున్న ‘వాంటెడ్ పండుగాడ్’ మూవీ ఆగస్ట్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఆదివారం చిత్ర బృందం సమక్షంలో ‘వాంటెడ్ పండుగాడ్’ మూవీ టీజర్ ను విడుదల చేశారు. ఈ సందర్బంగా చిత్ర సమర్పకులు కె. రాఘవేంద్రరావు మాట్లాడుతూ, ”చిన్న సినిమాగా వస్తున్న పెద్ద నవ్వుల చిత్రమిది. పెద్ద సినిమాలకు ప్రమోషన్స్ అక్కర్లేదు. కానీ చిన్న సినిమాలకు మీడియా సహకారం కావాలి. ఓటీటీ భూతం ఉంది కాబట్టి… జనాలను థియేటర్‌కు రప్పించడమే ఈ రోజుల్లో కష్టంగా మారింది. ఈ మూవీ షూటింగ్ సమయంలో ఓ సారి మారెడుమిల్లికి వెళ్లి చూశాను. మూడు రోజులుందామని వెళ్లా, కానీ పది రోజులుండిపోయాను. పొట్ట చెక్కలయ్యేలా నవ్వించారు. పాటలు కూడా అద్భుతంగా తెరకెక్కించారు. ఎంటర్టైన్మెంట్ సినిమాల్లో పాటలు ఎక్కువగా చూడరు. కానీ ఈ సినిమా మ్యూజికల్ ఎంటర్టైన్మెంట్. ‘నల్లమల’ సినిమాలో ‘ఏమున్నవే పిల్లా’ అనే పాట విన్నప్పుడే, పీఆర్‌ను మ్యూజిక్ డైరెక్టర్‌గా పెట్టుకోవాలని ఫిక్స్ అయ్యాను. కొత్త వాళ్లకు చాన్స్ ఇవ్వడం నాకిష్టం. ఆయన మంచి మ్యూజిక్ ఇచ్చారు. టీం అంతా కష్టపడి చేశారు. అందరికీ ఈ సినిమా నచ్చుతుంది” అని చెప్పారు.