ఒక ఇండస్ట్రీ నుంచి ఇద్దరు స్టార్ హీరోలు తమ సినిమాలని ఒకే సీజన్ లో రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందో ఈ సంక్రాంతికి చూసాం. ఒక రోజు గ్యాప్ తో బాలయ్య, చిరంజీవిల సినిమాలు రిలీజ్ అయితే థియేటర్స్ విషయంలో రచ్చ రచ్చ జరిగింది. ఒక ఇండస్ట్రీలోని స్టార్ హీరోల సినిమాలు వేరు వేరు డేట్స్ లో రిలీజ్ అయితేనే థియేటర్స్ పరిస్థితి ఇలా ఉంటే ఒకే డేట్ కి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని టాప్ మోస్ట్ సూపర్ స్టార్ హీరోలు తమ సినిమాలని రిలీజ్ చేస్తే ఇంకెలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఆగస్ట్ 11కి ఇలాంటి అరుదైన సంఘటననే జరగబోతోంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న మూడో సినిమా ‘SSMB 28’ రెగ్యులర్ షూటింగ్ ఇటివలే మొదలయ్యింది. ఈ మూవీని ఆగస్ట్ 11న ఆడియన్స్ ముందుకి తెస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. పాన్ ఇండియా స్థాయిలో మహేశ్ బాబుకి ఇదే మొదటి సినిమా.
సూపర్ స్టార్ ఇమేజ్ తో ఆగస్ట్ 11న ఆడియన్స్ ముందుకి రాబోతున్న మరో హీరో రణబీర్ కపూర్. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రణబీర్ కపూర్ ‘అనిమల్’ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీపై నార్త్ లో రణబీర్ వల్ల హైప్ పెరిగితే, సౌత్ లో సందీప్ రెడ్డి వంగ వల్ల అంచనాలు పెరుగుతున్నాయి. అనిమల్ మూవీ రణబీర్ కపూర్ కి సౌత్ కి పర్ఫెక్ట్ మార్కెట్ ని క్రియేట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ కోసం ఆగస్ట్ 11 డేట్ ని లాక్ చేశారు మేకర్స్. రణబీర్ కపూర్, మహేశ్ బాబులు సూపర్ స్టార్స్ అయితే నేనేంటి అంటూ ఆగస్ట్ 11నే ఆడియన్స్ ముందుకి రానున్నాడు రజినీకాంత్.
సూపర్ స్టార్ అనే బిరుదుకే పేరు తెచ్చిన రజినీ, ప్రస్తుతం జైలర్ అనే సినిమాలో నటిస్తున్నాడు. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో కన్నడ శివరాజ్ కుమార్, మలయాళ మోహన్ లాల్, కోలీవుడ్ శివకార్తికేయన్ లు స్పెషల్ రోల్స్ ప్లే చేస్తున్నారు. నెల్సన్, రజినీకాంత్ తో ఏం సినిమా చేస్తున్నాడో తెలియదు కానీ జైలర్ మూవీ కాస్టింగ్ చూస్తుంటే ఎవరికైనా మతి పోవాల్సిందే. సౌత్ ఇండస్ట్రీలోని సూపర్ స్టార్ మోహన్ లాల్, శివన్న లాంటి వాళ్లతో కలిసి రజినీకాంత్ ఆగస్ట్ 11న బాక్సాఫీస్ పై దండ యాత్ర చెయ్యబోతున్నాడు. రజినీ సినిమా అంటే అది తెలుగులో కూడా స్ట్రెయిట్ మూవీలాగే రిలీజ్ అవుతుంది. సో రజినీకాంత్ కూడా పాన్ ఇండియా రిలీజ్ కి వెళ్తున్నట్లే. మరి మహేశ్, రజినీ, రణబీర్ కపూర్ లలో ఎవరు ఏ రేంజ్ హిట్ కొడతారో తెలియదు కానీ ఒకేరోజు ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూడు సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చెయ్యడం అయితే గ్యారెంటి.