Tollywood: ఓటిటిలో సినిమాలకు అలవాటు పడిన ప్రేక్షకులు థియేటర్స్ కి రావడం బాగా తగ్గింది. బాగుంది అంటే తప్ప ఇల్లు వదలి సినిమాలకోసం థియేటర్స్ గుమ్మం తొక్కటం లేదు. ఒక వేళ సినిమాలు తీసి రిలీజ్ చేసినా దారుణమైన నష్టాలు చవి చూడవలసిని పరిస్థితి. ఈ తరుణంలో ఒకే సంస్థ నిర్మించిన మూడు సినిమాలు 2022లో వంద కోట్లను వసూలు చేయటం నిజంగా అభినందించదగ్గ విషయం. ఆ సినిమాలే ‘కాశ్మీర్ ఫైల్స్’, ‘కార్తికేయ2’, ‘ధమాకా’. వీటిని నిర్మించిన సంస్థ ఎఎఎ ఆర్ట్స్. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్. దీని అధినేత అభిషేక్ అగర్వాల్. వీటిలో ముందుగా విడుదలైన సినిమా ‘ద కాశ్మీర్ ఫైల్స్’. మార్చి 11, 2022లో విడుదలై ఈ సినిమా అనూహ్య విజయం సాధించింది. 15 కోట్లతో నిర్మితమైన ఈ చిత్రం దాదాపు 340 కోట్లను వసూలు చేసింది. మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్, పల్లవి జోషి నటించిన ఈ సినిమాకు వివేక్ అగ్నిహోత్రి దర్శకుడు. కశ్మీర్ పండిట్ల ఊచకోత ప్రధానాంశంగా తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.
ఇక ఆ తర్వాత పీపుల్స్ మీడియా సంస్థతో కలసి నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో నిర్మించిన ‘కార్తికేయ2’ సినిమా ఆగస్ట్ 13న విడుదలైంది. అనుపమ పరమేశ్వర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా కూడా ప్యాన్ ఇండియా సినిమాగా విడుదలై వంద కోట్ల క్లబ్ లో స్థానం సంపాదించింది. 25 నుంచి 30 కోట్లతో రూపొందిన ఈ సినిమా కూడా దాదాపు 120 కోట్ల వసూళ్ళను సాధించింది. ఆ తర్వాత రవితేజ హీరోగా నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో పీపుల్స్ మీడియా సంస్థతో కలసి అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మించిన ‘ధమాకా’ సినిమా డిసెంబర్ 23న విడుదలైంది. రవతేజ కెరీర్ లో ఇది తొలి వంద కోట్ల సినిమాగా నిలిచింది. దీంతో అభిషేక్ అగర్వాల్ అర్ట్స్ సంస్థ ఒకే ఏడాది మూడు వంద కోట్ల సినిమాలను అందించిన సంస్థగా టాలీవుడ్ చరిత్రపుటల్లో చోటు సంపాదించింది. ఇక ఎఎఎ సంస్థతో కలసి ‘కార్తికేయ2’, ‘ధమాకా’ నిర్మించిన పీపుల్స్ మీడియా సంస్థ కూడా రెండు వంద కోట్ల సినిమాలు అందించిన సంస్థగా గుర్తింపు తెచ్చుకుంది. సో ఈ సందర్భంగా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్స్ మీడియా సంస్థలకు అభినందనలు. ఈ సంస్థలు 2023లో కూడా అదే ఊపును కొనసాగించి హిట్ సినిమాలను అందించాలని కోరుకుందాం.