Telugu Cinema: లాస్ట్ వీకెండ్ ఎనిమిది సినిమాలు విడుదలైతే… అందులో ‘రామబాణం, ఉగ్రం’ మాత్రమే చెప్పుకోదగ్గవి. కానీ ఈ రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. ఈ వారం కూడా డబ్బింగ్ తో కలిపి ఎనిమిది చిత్రాలు జనం ముందుకు వస్తున్నాయి. బట్… వీటిల్లోనూ చెప్పుకోదగ్గవి కొన్నే! వాటిల్లో మొదటిది అక్కినేని నాగచైతన్య నటించిన ద్విభాషా చిత్రం ‘కస్టడీ’. అక్కినేని యంగ్ హీరో చైతు ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషించాడు. అతనితో ఇప్పటికే ‘బంగార్రాజు’లో జోడీ కట్టిన కృతిశెట్టి ఇందులో హీరోయిన్ గా నటించింది. ప్రముఖ తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. ఇళయరాజాతో పాటు ఆయన తనయుడు యువన్ శంకర్ రాజా దీనికి స్వరాలు అందించారు. ఈ సినిమా ఈ నెల 12న జనం ముందుకు వస్తోంది. అదే రోజున ఇళయరాజా సంగీతం అందించిన మరో సినిమా కూడా విడుదల అవుతుండటం విశేషం. మాజీ ఐ.ఎ.ఎస్. అధికారి బియ్యాల పాపారావు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘మ్యూజిక్ స్కూల్’ అనే సినిమాలో శ్రియా శరణ్, శర్మన్ జోషి, ప్రకాష్‌రాజ్ కీలక పాత్రలు పోషించారు. విద్యతో పాటుగా కళలనూ విద్యార్థులు అభ్యసించాలని, అప్పుడే మనోవికాసం కలుగుతుందని దర్శక నిర్మాత పాపారావు ఈ సినిమా ద్వారా తెలియచేయబోతున్నారు.
సునీల్, శ్రీనివాస్ రెడ్డి, ‘వెన్నెల’ కిషోర్, ధనరాజ్ ప్రధాన పాత్రలు పోషించిన ‘భువనవిజయమ్’ చిత్రం 12వ తేదీ విడుదల అవుతోంది. యలమంద చరణ్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ కిరణ్, విఎస్కే దీన్ని నిర్మిస్తున్నారు. ఈ సోషియా ఫాంటసీ డ్రామాకు శేఖర్ చంద్ర సంగీతాన్ని అందించాడు. గతంలోనే విడుదల కావాల్సి ఉండి అనివార్యంగా వాయిదా పడిన ‘కథ వెనుక కథ’ చిత్రం కూడా శుక్రవారమే జనం ముందుకు వస్తోంది. విశ్వంత్ దుడ్డుంపూడి, శ్రీజిత గౌష్, శుభ శ్రీ ప్రధాన తారాగణంగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో అవనీంద్ర కుమార్ దీన్ని నిర్మించారు. ఇదే రోజున శేఖర్ అయాన్ వర్మ, వైభవి రావ్ హీరో హీరోయిన్లుగా సాయి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న లవ్, యాక్షన్ డ్రామా ‘కళ్యాణమస్తు’ విడుదల అవుతోంది. ఈ సినిమాలతో పాటు ‘టీబ్రేక్’, ‘ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్’ చిత్రాలు జనాలను అలరించడానికి శుక్రవారం వస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రముఖ నటి ఐశ్వర్య రాజేశ్ ఇప్పటికే పలు తమిళ, తెలుగు సినిమాలతో మన వారికి సుపరిచితురాలు అయ్యింది. అలనాటి హీరో రాజేశ్ కుమార్తె అయిన ఐశ్వర్య ఈ మధ్య హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ లోనూ చేస్తోంది. ఆమె నటించిన ‘ఫర్హానా’ చిత్రం 12న తమిళంతో పాటు తెలుగుతోనూ వస్తోంది.
తెలుగు దర్శకుల హిందీ చిత్రాలు!
ఈ శుక్రవారం బాలీవుడ్ లో తెలుగు దర్శకుల హవా గట్టిగా వీచబోతోంది. బియ్యాల పాపారావు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘మ్యూజిక్ స్కూల్’ హిందీలోనూ విడుదల అవుతుండగా, ‘ఛత్రపతి’ రీమేక్ తో ప్రముఖ దర్శకుడు వి. వి. వినాయక్, యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. టాలీవుడ్ లో సాయి శ్రీనివాస్ తొలి చిత్రం ‘అల్లుడు శీను’ను వినాయకే తెరకెక్కించారు. బహుశా అదే సెంటిమెంట్ తో ఇప్పుడు హిందీలోనూ తొలి చిత్రానికి ఆయన్నే దర్శకుడిగా పెట్టుకున్నారు. అలానే ఇప్పటికే ‘ఘాజీ’ చిత్రంతో బాలీవుడ్ లో దర్శకుడిగా తనకంటూ చక్కని గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు సంకల్ప్ రెడ్డి ఇప్పుడు ‘ఐ. బి. 71’ సినిమాను తెరకెక్కించాడు. ఇది 12వ తేదీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. విద్యుత్ జమ్వాల్ హీరోగా నటించడంతో పాటు దీన్ని ప్రొడ్యూస్ చేశాడు. ఇలా ముగ్గురు తెలుగు దర్శకుల చిత్రాలు ఉత్తరాదిన ఒకే రోజున విడుదల అవుతుండటం విశేషం!!