ఎంత గాఢంగా ప్రేమించుకున్నా.. విషయం పెళ్లిదాకా వచ్చినప్పుడు కట్నకానుల వ్యవహారం తప్పకుండా తెరమీదకొస్తుంది. తాము అడిగినంత ఇస్తేనే పెళ్లికి ఒప్పుకుంటామని అబ్బాయి తరఫు వారు మొండికేస్తారు. ఇలాంటి విషయాల్లోనే తేడాలు రావడం వల్ల, ఎన్నో పెళ్లిళ్లు పెటాకులైన సందర్భాలూ ఉన్నాయి. పీకల్లోతు ప్రేమించకున్న వారు సైతం, ఆ మేటర్‌లో గొడవపడి తమ పెళ్లి రద్దు చేసుకున్న వారున్నారు. అందుకే, పెళ్లి అనగానే ఎవ్వరైనా ‘కట్నకానుకలు ఎంత, ఏమిచ్చారు’ అని చర్చించుకోవడం మొదలుపెడతారు.
ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ పెళ్లి తర్వాత కూడా అలాంటి కట్నకానుకల చర్చలు జరిగాయి. కచ్ఛితంగా ఆది భారీ మొత్తం పుచ్చుకొని ఉంటాడని చాలామంది అభిప్రాయాలు వ్యక్తపరిచారు. కానీ, అతను నిక్కీ గల్రానీ కుటుంబం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని సన్నిహితులు చెప్తున్నారు. నిజానికి.. ఆది కట్నకానుకలకు బద్ధ వ్యతిరేకి అని, నిక్కీ కుటుంబం భారీ మొత్తం ఇచ్చేందుకు సిద్ధమైనా అతను నయా పైసా కూడా పుచ్చుకోలేదని స్పష్టతనిచ్చారు. దీంతో, ఆది మంచి మనసును నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ఈరోజుల్లో కూడా కట్నకానుకలు తీసుకోని ఆది లాంటి వారు ఉండడం నిజంగా నిక్కీ అదృష్టమని కొనియాడుతున్నారు.
కాగా.. ఆది, నిక్కీ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2015లో వచ్చిన ‘యాగవరైనమ్ నా కక్కా’ అనే సినిమాలో వీళ్లిద్దరు తొలిసారి కలిసి నటించారు. ఆ సినిమా సమయంలోనే స్నేహితులుగా మారారు. ఆ తర్వాత ‘మరగధ నాణ్యం’ అనే చిత్రంలో కలిసి నటించినప్పుడు.. ప్రేమలో పడ్డారు. కొన్నాళ్ళు డేటింగ్ చేసుకున్న ఈ ఇద్దరూ.. తమ అభిరుచులు కలవడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని, పెద్దలని ఒప్పించారు. ఈ ఏడాది మే 18న వీరి వివాహం జరిగింది.