రెండేళ్ల పాటు కరోనా కారణంగా కుదేలైన సినిమా రంగం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. అయితే ఇంతలోనే కొత్త సమస్యలు కొన్ని చిత్రసీమను ఉక్కిరి బిక్కిరి చేయబోతున్నాయన్నది ఫిల్మ్ నగర్ టాక్. ఫిల్మ్ ఫెడరేషన్‌లోని 24 క్రాఫ్టులకు సంబంధించిన వేతనాలను సవరించాల్సి ఉండటంతో వారు నిర్మాతలపై ఒత్తిడి చేస్తున్నారు. వెంటనే వేతనాలను పెంచకపోతే, జూలై 1వ తేదీ నుంచి యూనియన్లు సమ్మె బాట పట్టినా ఆశ్చర్యం లేదని ఫెడరేషన్ పెద్దలు కొందరు చెబుతున్నారు. సమ్మె నోటీస్‌ను ఫెడరేషన్ ఇటు ఫిల్మ్ ఛాంబర్, అటు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కు ఇవ్వకపోయినా… దాదాపుగా వారూ అదే తరహాలో మాట్లాడుతున్నారు.
ఈ నేపథ్యంలో సోమవారం తెలుగు నిర్మాతల మండలి, ఫిల్మ్ ఛాంబర్ లోని నిర్మాతలు సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. సినీ కార్మికుల వేతనాలు పెంచడానికి ముందు ఎంప్లాయిస్ ఫెడరేషన్ తో తమకున్న పాత పంచాయితీలు తేలాల్సి ఉందని, గతంలో చేసుకున్న అగ్రిమెంట్లను యూనియన్లు అమలు చేయలేదని నిర్మాతలు ఈ సమావేశంలో అసహనం వ్యక్తం చేసినట్లు వినికిడి. ముఖ్యంగా ఫైటర్స్ యూనియన్‌తో కొందరు నిర్మాతలకు చేదు అనుభవాలు ఎదురైనట్లు తెలుస్తోంది. ఇప్పుడున్న ఫెడరేషన్ కార్యవర్గం మాటలను అందులోని యూనియన్ల నాయకులు పెడ చెవిన పెడుతున్నారనే విమర్శ కూడా ఉంది. మే డే రోజున సినిమాల షూటింగ్స్ చేయవద్దని ఫెడరేషన్ కోరినా, ఆ రోజు ఐదు సినిమాల షూటింగ్స్ జరిగాయని, సో… సినిమా కార్మికులు, వారి యూనియన్లపై ఫెడరేషన్ కు పట్టు లేదనేది ఆ సంఘటనతో రుజువైందని కొందరు నిర్మాతలు ఈ సమావేశంలో ప్రస్తావించారట. అలాంటి ఫెడరేషన్ విధించే షరతులను ఎలా అంగీకరిస్తామని కూడా కొందరు నిర్మాతలు ప్రశ్నించినట్టు తెలిసింది.
ఒకవేళ ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సమ్మెకు దిగితే, దానిని తాము సమర్థవంతంగా ఎదుర్కోగలమనే ధీమాను కొందరు నిర్మాతలు వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ మొత్తం వ్యవహారం తర్వాత ఫెడరేషన్ ఏ నిర్ణయం తీసుకుంటుందనేది తెలియాల్సి ఉంది. ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ దీనిపై వివరణ ఇవ్వడానికి అందుబాటులోకి రాలేదు. మరి ఈ వివాదం చినికి చినికి గాలివానగా మారకముందే. సినిమా పెద్దలు కల్పించుకుని చల్లబరుస్తారో లేదో చూడాలి.