ప్రముఖ కథానాయిక కీర్తిసురేశ్ మొదటి తెలుగు సినిమా ఏమిటో మీకు తెలుసా! చాలా యేళ్ళ క్రితమే ఆమె సీనియర్ నటుడు నరేశ్ తనయుడు నవీన్ కృష్ణ సరసన ‘ఐనా… ఇష్టం నువ్వు’ మూవీలో నటించింది. ఆ సినిమా విడుదల కాలేదు. ఆ తర్వాత ఇటు నవీన్ కృష్ణ, అటు కీర్తి సురేశ్ వేర్వేరు సినిమాలతో జనం ముందుకు వచ్చారు. విశేషం ఏమంటే… ఆ మొదటి సినిమాను కృష్ణవంశీ శిష్యుడు రామ్ ప్రసాద్ రఘుతు తెరకెక్కించాడు. పలువురు నిర్మాతల చేతులు మారడమే కాదు… ఈ సినిమా పేరూ అనేకసార్లు మారింది. ‘ఐనా ఇష్టం నువ్వు’ను ఆ తర్వాత ‘జానకితో నేను’గా మార్చారు. ఆ తర్వాత ఇంకో నిర్మాత చేతిలోకి ఈ ప్రాజెక్ట్ మారినప్పుడు ‘రెండు జెళ్ళ సీత’ అనే పేరు పెట్టారు. ఇప్పుడు తాజాగా ఈ సినిమాను తమటం కుమార్ రెడ్డి విడుదల చేయబోతున్నారు. దాంతో ఇప్పుడీ మూవీకి ‘జానకి రామ్’ అనే పేరు ఖరారు చేశారు.
ఈ సినిమా గురించి నిర్మాత కుమార్ రెడ్డి చెబుతూ, ”ఇటీవల విడుదల చేసిన మా చిత్రంలోని పాటలకు మంచి స్పందన వచ్చింది. మూవీ సెన్సార్ పనులు పూర్తయ్యాయి. సెన్సార్ వారు యు/ఏ సర్టిఫికెట్ మంజూరు చేశారు. త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. హ్యూమన్ ట్రాఫికింగ్ నేపథ్యంలో మ్యూజికల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన చిత్రమిది. అచ్చు రాజమణి ఏడు అద్భుతమైన పాటలు కంపోజ్ చేశారు. మెగాబ్రదర్ నాగబాబు ఇందులో కీలకమైన పాత్రను పోషించారు. కీర్తి సురేష్ , నవీన్ కృష్ణ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. కీర్తి సురేష్ అందం, అభినయంతో పాటు నవీన్ కృష్ణ పెర్పార్మెన్స్ ఆకట్టుకుంటాయి. సప్తగిరి, పోసాని, రాహుల్ దేవ్ , రఘు కారుమంచి ప్రాధాన్యం ఉన్న పాత్రలు పోషించారు. మరో ఇంపార్టెంట్ రోల్ లో చాందిని నటించింది. త్వరలో సినిమా విడుదల తేదీ ప్రకటిస్తాం” అని అన్నారు.