చిన్నచిత్రంగా వచ్చి భారీ విజయాలను చవిచూసిన సినిమాలు అనేకం ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలో తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను చూసిన చిత్రాలు అంతగా కనిపించలేదు. కారణం కరోనా కావచ్చు, మరేదైనా అవ్వవచ్చు. గత సంవత్సరం డిసెంబర నెల నుండే సినిమాలు మళ్ళీ కాంతులు విరజిమ్ముతున్నాయి. ఇప్పుడు ‘ద కశ్మీర్ ఫైల్స్’ చిత్రం రాకతో ఆ వెలుగులు మరింతగా పెరిగాయి. చిన్న సినిమాలకు కొత్త ఉత్సాహాన్నీ ఇచ్చాయి. ‘ద కశ్మీర్ ఫైల్స్’ చిత్రం రోజు రోజుకూ వసూళ్ళు పెంచుకుంటూ పోతోంది. మార్చి 11న జనం ముందు నిలచిన ‘ద కశ్మీర్ ఫైల్స్’ ఆరు రోజులకే రూ.79.25 కోట్లు పోగేసింది. మరో విశేషమేంటంటే, వీకెండ్ తరువాత కూడా మూడో రోజున అంటే ఈ సినిమా విడుదలైన ఆరో రోజున మరిన్ని వసూళ్ళు చూసింది.
టాప్ టెన్ ఫస్ట్ వెడ్నెస్ డే మూవీస్ లో చిన్నచిత్రమైన ‘ద కశ్మీర్ ఫైల్స్’ ఏడో స్థానంలో నిలవడం సంచలనంగా మారింది. భారీ చిత్రాలుగా రూపొందిన “బజరంగీ భాయిజాన్, క్రిష్-3, సంజూ”ను పక్కకు నెట్టి ఆ స్థానం దక్కించుకోవడం ప్రస్తుతం బాలీవుడ్ లో చర్చనీయాంశమయింది. ఈ జాబితాలో తొలి స్థానంలో రూ.26 కోట్లతో ‘బాహుబలి-2’ నిలవగా, తరువాతి స్థానంలో రూ.25.52 కోట్లతో ‘ధూమ్-3’ ఉంది. వరుసగా “గుడ్ న్యూజ్ (రూ.22.50 కోట్లు), కిక్ (రూ.21.66 కోట్లు), దంగల్ (రూ.21.46 కోట్లు), పీ.కె. (రూ.19.55 కోట్లు), ద కశ్మీర్ ఫైల్స్ (రూ.19.05 కోట్లు), సంజు (రూ.18.90 కోట్లు), క్రిష్-3 (రూ.18.11 కోట్లు), బజరంగీ భాయిజాన్ (రూ.18.02 కోట్లు) నిలిచాయి.
మరింత ఆశ్చర్యకరమైన విశేషం ఏమంటే ‘ద కశ్మీర్ ఫైల్స్’ మొదటి రోజున రూ.3.55 కోట్లు మాత్రమే పోగేసింది. రెండో రోజున రూ. 8.5 కోట్లు చూసింది. మౌత్ టాక్ తో మూడో రోజున రూ. 15.10 కోట్లు, నాలుగో రోజున రూ. 15.05 కోట్లు అందుకుంది. నిజానికి ఏ సినిమా అయినా మంగళవారం కాస్త డల్ కావాలి. కానీ, ఈ చిత్రం రూ.18 కోట్లు సంపాదించి, అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. థియేటర్లు పెరగడంతో ఆరో రోజున రూ.19.05 కోట్లు పోగేసి పెద్ద చిత్రాల సరసన చేరిపోయంది. రాబోయే రోజుల్లో అన్ని రాష్ట్రాలలోనూ ‘ద కశ్మీర్ ఫైల్స్’ మరింత ఆదరణ చూరగొంటూ, ఇంకా కొల్లగొట్టే అవకాశం ఉంది. ఒకవేళ రాజమౌళి ‘ట్రిపుల్ ఆర్’ మూవీ వచ్చినా, ఆ పాటికే ఈ చిత్రం దాదాపు రూ.200 కోట్లు పోగేస్తుందని అంచనా! తరువాత కూడా ‘ట్రిపుల్ ఆర్’ ఓవర్ ఫ్లో ‘ద కశ్మీర్ ఫైల్స్’కు లాభమే చేకూరుస్తుందని ట్రేడ్ పండిట్స్ చెబుతున్నారు. కేవలం రూ.15 కోట్ల పెట్టుబడితో తెరకెక్కిన ‘ద కశ్మీర్ ఫైల్స్’ చిత్రం టోటల్ రన్ లో ఎంత పోగేస్తుందో చూడాలి అన్న ఆసక్తి ప్రస్తుతం బాలీవుడ్ లో నెలకొంది.