జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ అకా దళపతి విజయ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 30 ఏళ్లు అయిన సంధర్భంగా ఆయన ఫాన్స్ #30YearsOfVijayism అనే ట్యాగ్ ని క్రియేట్ చేసి ట్వీట్స్ చేస్తున్నారు. ప్రొడ్యూసర్ ఎస్.ఏ చంద్రశేఖర్ కొడుకుగా ‘వెట్రి'(1984) సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్, ‘నాళయ తీర్పు'(1992) అనే సినిమాతో సోలో హీరోగా డెబ్యు ఇచ్చాడు. 2000లో విడుదలైన ‘ఖుషి’ సినిమా వరకూ అప్పుడప్పుడూ హిట్స్ కొడుతున్న విజయ్, ‘ఖుషి’ సినిమాతో ఒక్కసారిగా ఫ్యూచర్ స్టార్ అనే పేరు తెచ్చుకున్నాడు. ఆ వెంటనే ‘గిల్లీ’, ‘తిరుపాచ్చి’, ‘శివకాశి’, ‘పోకిరి’సినిమాలు సూపర్ హిట్స్ అవ్వడంతో విజయ్ కాస్త ‘ఇళయ దళపతి విజయ్’ అయ్యాడు, ఫ్యూచర్ స్టార్ అనే మాటని చెరిపేసి స్టార్ హీరో అయ్యాడు. ఇక విజయ్ ఇండస్ట్రీని రూల్ చేస్తాడని అంతా అనుకున్నారు కానీ అలా జరగలేదు కారణం అయిదేళ్ల పాటు విజయ్ కి హిట్ అనే మాటే లేకపోవడం. 2007 నుంచి 2012 వరకూ విజయ్ నటించిన ప్రతి సినిమా బాక్సాఫీస్ దెగ్గర బోల్తా కొట్టింది. ఇక విజయ్ కెరీర్ అయిపోయిందని డిసైడ్ అయిపోయిన వాళ్లు చాలా మందే ఉన్నారు.
బ్యాక్ టు బ్యాక్ పది ఫ్లాప్స్ ఇచ్చి కీరీర్ గ్రాఫ్ పూర్తిగా పడిపోయిన విజయ్, ఎలా అయినా హిట్ కొట్టాల్సిన పరిస్థితిలో మురగదాస్ తో కలిశాడు. ఈ ఇద్దరి కలయికలో ‘తుపాకీ’ సినిమా వచ్చింది. ముందెన్నడూ కనిపించని లుక్ లో విజయ్, తమిళనాడులోనే కాదు తెలుగులో కూడా ఫస్ట్ హిట్ అందుకున్నాడు. తుపాకీ సినిమా విజయ్ కెరీర్ కి ప్రాణం పోసింది. మచ్ నీడేడ్ హిట్ కొట్టిన తర్వాత ఇక విజయ్ వెనక్కి తిరిగి చూసుకోలేదు, ఫ్లాప్స్ లో ఉన్న సమయంలో తనని చూసి నవ్విన వాళ్లే ఆశ్చర్యపోయే రేంజులో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చాడు. ‘కత్తి’, ‘మెర్సల్’, ‘సర్కార్’, ‘బిగిల్’, ‘మాస్టర్’ ఇలా విజయ్ నటించిన ప్రతి సినిమా ఒకదాన్ని మించి మరొకటి హిట్ అయ్యింది. అందుకే అతన్ని ‘ఇళయ దళపతి’ నుంచి ‘దళపతి విజయ్’ ని చేశారు అభిమానులు. ఈ సమయంలో విజయ్ ని రజినీకాంత్ కన్నా పెద్ద స్టార్ గా అక్కడి మీడియా పేర్కొనడం విశేషం. రజినీ తర్వాత అంతటి క్రౌడ్ పుల్లింగ్ స్టామినా విజయ్ కి మాత్రమే ఉందని సినీ పండితులు కితాబులు కూడా ఇచ్చారు. ఈ ఇయర్ రిలీజ్ అయిన ‘బీస్ట్’ సినిమా అంతగా ఆడలేదు కానీ నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి రానున్న ‘వారిసు’ సినిమాపై భారి అంచనాలు ఉన్నాయి. వారిసు సినిమాతో తెలుగు తమిళ భాషల్లో హిట్ కొట్టాలనేది విజయ్ ప్లాన్. మంచి డాన్సర్, సింగర్, యాక్టర్ అయిన దళపతి విజయ్ ‘వారిసు’ సినిమాతో కంబ్యాక్ హిట్ ఇస్తాడేమో చూడాలి.