C Kalyan: గత కొన్ని రోజులుగా కొందరు చిన్న చిత్రాల నిర్మాతలు ‘తెలుగు నిర్మాతల మండలి’కి సత్వరమే ఎన్నికలు జరిపించాలని, డిజిటైల్ ప్రొవైడర్స్ ఛార్జీలు తగ్గించేలా చర్చలు తీసుకోవాలని ఛాంబర్ ఆవరణలో దీక్ష చేస్తున్నారు. బుధవారం వీరు దానిని విరమించారు. ఫిబ్రవరి 26న నిర్మాతల మండలి ఎన్నికలు జరపడానికి కార్యవర్గం అంగీకరించిందని వారు పేర్కొన్నారు. అయితే… దీనిని నిర్మాతల మండలి అధ్యక్షుడు సి. కళ్యాణ్ ఖండించారు.
1200 మంది సభ్యులు ఉన్న నిర్మాతల మండలిలో ఒక్క శాతం మంది టెంట్ లు వేసి, నిరసన తెలిపితే, తాము చలించబోమని సి. కళ్యాణ్ తెలిపారు. ఏ ఒక్కరికో నిర్మాతల మండలి భయపడదని, ఎవరికీ తలదించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. వారు ఊహిస్తున్నట్టుగా, ప్రచారం చేస్తున్నట్టుగా ఫిబ్రవరి 26న ఎన్నికలు జరపడం లేదని అన్నారు. సమష్ఠిగా ఓ నిర్ణయం తీసుకుని తమ వీలును బట్టి, ఎన్నికల అధికారి సూచనలను బట్టి ఎన్నికలు జరుపుతాము తప్పితే, ఎవరి డిమాండ్ కు లొంగే ప్రసక్తే లేదని తెలిపారు. నిజానికి నిర్మాతల మండలిలో ఉన్న మూలధనం రెగ్యులర్ నిర్మాతలు, పెద్ద చిత్రాల నిర్మాతలు పోగుచేసిందేనని, ఇక్కడి సభ్యుల వైఖరి నచ్చక వారంత వేరుగా గిల్డ్ ను పెట్టుకున్నారని, తిరిగి వారు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో క్రియాశీలక బాధ్యతలను స్వీకరించాల్సిన అవసరం ఉందని కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. తాను ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలో ఎలాంటి అక్రమాలు జరగలేదని, దానిపై ఎలాంటి విచారణకైనా సిద్ధమేననని సవాల్ చేశారు. తనను వ్యక్తిగతంగా విమర్శించే దమ్ము, ధైర్యం ఎవరికీ లేవని, అలా ఎవరైనా ముందుకొస్తే… వాళ్ళకు తగిన శాస్త్రి తప్పదని హెచ్చరించారు. దొంగచాటుగా కౌన్సిల్ లో సభ్యత్వం పొందిన కొందరు పనికట్టుకుని పిచ్చి పిచ్చి విమర్శలు చేస్తున్నారని అన్నారు. ‘దిల్’ రాజుతో తనకు గొడవలున్నాయని కొందరు చేస్తున్న ప్రచారంలోనూ ఎలాంటి నిజం లేదని చెప్పారు. నిర్మాతల మండలిలో సభ్యులుగా ఉన్నవారంతా ఎన్నికల్లో పాల్గొని, సరైన వ్యక్తులను ఎన్నుకుంటే… ఇలాంటి సమస్యలు పునరావృతం కావని, అందుకోసం తాను వచ్చే ఎన్నికల్లో గట్టిగా ప్రయత్నం చేస్తానని చెప్పారు.