నవతరం కథానాయకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించిన నితిన్ హీరోగా రెండు దశాబ్దాలు పూర్తి చేసుకుంటున్నాడు. నితిన్ నటించిన తొలి చిత్రం ‘జయం’ విడుదలై జూన్ 14తో ఇరవై ఏళ్ళు పూర్తవుతున్నాయి. తేజ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘జయం’ చిత్రం ఆ రోజుల్లో ఘనవిజయం సాధించింది.
‘జయం’ ప్రేమకథతో రూపొందిన చిత్రం. ఫార్ములా చాలా పాతగానే కనిపిస్తుంది. ఓ పేద అబ్బాయి, కలవారి అమ్మాయిని ప్రేమించడం, ప్రేమను గెలిపించుకోవడంలో ఇక్కట్లు ఎదురవ్వడం, వాటిని దాటుకొని చివరకు పెళ్ళి చేసుకోవడం అన్నదే ఇందులోని సారాంశం. అయితే ఈ లైన్ ను పట్టుకొని యువతను ఆకట్టుకుంటూ తేజ ‘జయం’ చిత్రాన్ని నడిపిన తీరు అలరించింది. ఆ రోజుల్లో యూత్ కిర్రెక్కిపోయి మరీ ‘జయం’ చిత్రాన్ని ఆదరించారు. కథ విషయానికి వస్తే – బంధువులు అయిన ఇద్దరు మిత్రులు తమ పిల్లలతోనూ సంబంధం కలుపుకోవాలనుకుంటారు. కానీ వారి పిల్లలు సుజాత, రఘుకు ఒకరంటే ఒకరికి పడదు. పెరిగి పెద్దయి కాలేజ్ కు వెళుతున్న సుజాత సంప్రదాయబద్ధంగా పెరుగుతుంది. రఘు పోకిరి వెధవగానే కాదు, కంటికి నచ్చిన అమ్మాయిని పొందాలని చూసే మనస్తత్వంతో పెరుగుతాడు. కాలేజ్ లో సుజాత, వెంకటరమణను ప్రేమిస్తుంది. వారిద్దరి ప్రేమ పెద్దవారికి తెలుస్తుంది. సుజాతను కాలేజ్ మానిపిస్తారు. ముందుగా అనుకున్నట్టు తమ బంధువుల అబ్బాయి రఘుకు ఇచ్చి పెళ్ళి చేయాలని నిశ్చయిస్తారు. రఘు, సుజాతను చేసుకోనని అంటాడు. తీరా అమ్మాయిని చూశాక ఆమె అందం చూసి చేసుకోవాలనుకుంటాడు. ఆమె తన ప్రేమ విషయం చెప్పినా, వాడితో కాపురం చేసినా సరే నిన్నే చేసుకుంటా అంటాడు. వెంకటరమణ తన మిత్రుల సాయంతో ప్రియురాలు సుజాతను తీసుకుపోతాడు. అడవుల్లో తిరుగుతూ ఆ దేవునిపైనే భారం వేసి ఉంటారు. వారిని పట్టుకొని, ఎలాగైనా సుజాతను పెళ్ళాడాలని తన అనుచరులతో వస్తాడు రఘు. వెంకటరమణను చితక బాదుతాడు. అయితే అతనిలో ధైర్యం నూరిపోసి, ఆంజనేయస్వామి జెండా ఇచ్చి పోరాడమంటుంది సుజాత. రఘును చితక్కొడతాడు వెంకటరమణ. రఘు తండ్రి సైతం తన కోడలు సుజాత కంటనీరు పెట్టరాదని, ఆమె కోరుకున్నవాడితోనే జీవితం సాగాలని ఆశిస్తాడు. అలా పెద్దవాళ్ళు కూడా అంగీకరించడంతో రమణ, సుజాత పెళ్ళి చేసుకోవడంతో కథ సుఖాంతమవుతుంది.
నితిన్ కు ఇది తొలి చిత్రమే అయినా, అతని నుండి మంచి నటన రాబట్టాడు దర్శకుడు తేజ. సదా తన అందాల అభినయంతో ఆకట్టుకుంది. హీరోగా అరంగేట్రం చేసి, అపజయం చవిచూసిన గోపీచంద్, ఈ సినిమాలో విలన్ గా నటించి నటునిగా మార్కులు సంపాదించాడు. హీరో ఫ్రెండ్ గా నటించిన సుమన్ శెట్టి బెస్ట్ కమెడియన్ గా నంది అవార్డునూ అందుకున్నాడు. మిగిలిన పాత్రల్లో శివకృష్ణ, ప్రసాద్ బాబు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, చిత్తజల్లు లక్ష్మి, సుప్రీత్, రాళ్ళపల్లి, దువ్వాసి మోహన్, సత్తిబాబు, జెన్నీ, షకీల, ఢిల్లీ రాజేశ్వరి, శ్రీలక్ష్మి, ఆలపాటి లక్ష్మి, నిర్మలా రెడ్డి నటించారు.
‘జయం’ మంచి విజయం సాధించి, నిర్మాతకు లాభాలూ ఆర్జించి పెట్టింది. రజతోత్సవం జరుపుకుంది. కొన్ని కేంద్రాలలో టాప్ స్టార్స్ స్థాయిలో ఈ సినిమా వసూళ్ళు రాబట్టడం అప్పట్లో విశేషంగా చెప్పుకున్నారు. ఈ చిత్రానికి ఆర్పీ పట్నాయక్ సంగీతం, కులశేఖర్ పాటలు ప్రాణం పోశాయి. ఇందులోని “వీరి వీరి గుమ్మడి పండు…”, “బండి బండి రైలూ బండి…”, “ప్రియతమా తెలుసునా…”, “రాను రానంటూనే చిన్నదో..”, “ఎవ్వరు ఏమన్నా…”, “గోరంత దీపం…”, “ప్రేమా ఓ ప్రేమా…” అంటూ సాగే పాటలు భలేగా అలరించాయి. ఈ సినిమాతో సుమన్ శెట్టితో పాటు బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా బేబీ శ్వేత, బెస్ట్ ఫిమేల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సునీత కూడా నంది అవార్డులు సొంతం చేసుకున్నారు. ‘జయం’ సినిమాను తమిళంలో ప్రముఖ నిర్మాత ఎడిటర్ మోహన్ చిన్న కొడుకు రవి హీరోగా పెద్ద కొడుకు రాజా దర్శకత్వంలో నిర్మించారు. అక్కడా ఈ సినిమా మంచి విజయం సాధించింది. దాంతో హీరో ఇప్పటికీ ‘జయం’ రవిగా జనం మదిలో నిలచే ఉన్నాడు. హిందీలో ఈ చిత్రాన్ని ‘హోగీ ప్యార్ కీ జీత్’ అనే పేరుతో డబ్బింగ్ చేశారు.