Telugu Movies Releasing This Weekend: ఆగస్ట్ 1 నుండి సినిమా షూటింగ్స్ ఆగిపోయిన నేపథ్యంలో వివిధ శాఖలతో ఫిల్మ్ ఛాంబర్, నిర్మాతల మండలి, యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ పెద్దలు ముమ్మరంగా చర్చలు జరుపుతున్నారు. ఇదే సమయంలో ఆగస్ట్ 5న విడుదలైన ‘బింబిసార’, ‘సీతారామం’ చిత్రాలు చక్కని విజయాన్ని సొంతం చేసుకోవడంతో చిత్రసీమకు కొత్త ఊపిరిలద్దినట్టు అయ్యింది. దాంతో ఈ వారాంతంలో విడుదలయ్యే సినిమాలపైనా భారీ ఆశలు చిగురించడం మొదలైంది. ఈ నెల 11న ఆమీర్ ఖాన్ పాన్ ‘లాల్ సింగ్ చడ్డా’ మూవీ విడుదల కానుంది. నాగచైతన్యకు ఇదే తొలి హిందీ చిత్రం కాగా, ఈ సినిమా తెలుగు వర్షన్ కు చిరంజీవి సమర్పకుడిగా వ్యవహరిస్తుండటం విశేషం. అయితే గతంలో ఆమీర్ ఖాన్ ‘ఈ దేశాన్ని విడిచి పోదామని తన భార్య అంటోంద’ని అసహనం వ్యక్తం చేసిన సంఘటనను, ‘పీకే’ సినిమాలో శివుడి పాత్రను అపహాస్యం చేయడాన్ని గుర్తు చేస్తూ కొందరు సోషల్ మీడియాలో నెగెటివ్ ప్రచారాన్ని మొదలు పెట్టారు. ‘లాల్ సింగ్ చడ్డా’ను బాయ్ కాట్ చేయాలని హంగామా సృష్టిస్తున్నారు. దీనిపై ఇప్పటికే ఆమీర్ వివరణ ఇచ్చారు.
ఇదిలా ఉంటే… ‘లాల్ సింగ్ చడ్డా’ విడుదలైన మర్నాడే… అంటే ఆగస్ట్ 12న నితిన్ నటించిన సొంత చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’ రిలీజ్ కాబోతోంది. ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా మీద నితిన్ బాగానే ఆశలు పెట్టుకున్నాడు. ఇప్పటికే ఈ మూవీ పాటలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇక అదే రోజున గాంధీ హత్య నేపథ్యంలో, నాధురామ్ గాడ్సే మరణవాగ్మూలం ఆధారంగా రూపుదిద్దుకున్న ‘1948 అఖండ భారత్’ మూవీ విడుదల కానుంది. ఆగస్ట్ 13, శనివారం నిఖిల్ ‘కార్తికేయ -2’ సినిమా రిలీజ్ అవుతోంది. శ్రీకృష్ణుడి కాలంలో సముద్ర గర్భంలో కలిసిపోయిన ద్వారక నగర రహస్యాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కడం విశేషం. అలానే ఈ శుక్రవారం ఆహా ఓటీటీ సంస్థ కూడా రెండు అనువాద చిత్రాలను స్ట్రీమింగ్ చేస్తోంది. అందులో ఒకటి ఫహద్ ఫాజిల్ నటించిన మలయాళ చిత్రం ‘మాలిక్’ కాగా, మరొకటి విజయ్ సేతుపతి ‘మహామనిషి’. ఈ రెండు కూడా ఆ యా భాషల్లో ఇప్పటికే థియేటర్లలో సందడి చేశాయి. ఆగస్ట్ 5న విడుదలైన సినిమాలు తీసుకొచ్చిన పాజిటివ్ వైబ్స్ ఈ వీకెండ్ మూవీస్ కు ఏ మేరకు ఉపయోగపడతాయో చూడాలి.