ఈ యేడాది ప్రారంభంలోనే ఆది సాయికుమార్ నటించిన ‘అతిథి దేవో భవ’ చిత్రం విడుదలైంది. ఇదే సమయంలో అతను నటిస్తున్న దాదాపు ఐదారు చిత్రాలు సెట్స్ పై వివిధ దశలలో ఉన్నాయి. వాటిలో ఒకటి ‘తీస్ మార్ ఖాన్’. ఇటీవల షూటింగ్ పూర్తయిన ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు సోమవారం మొదలయ్యాయి. అతిత్వరలో ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ విషయంలో డిఫరెంట్‌గా దూసుకుపోతోంది ‘తీస్ మార్ ఖాన్’ టీమ్. ఓ వైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటుగా ఈ మూవీ ప్రమోషన్స్ చేపడుతూ చిత్రాన్ని ఆడియన్స్‌కి చేరువ చేస్తున్నారు.
విజన్ సినిమాస్ బ్యానర్‌పై నాగం తిరుపతి రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ‘తీస్ మార్ ఖాన్’ సినిమా నిర్మిస్తున్నారు. ‘నాటకం’ ఫేమ్ కళ్యాణ్ జి గోగణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ‘ఆర్.ఎక్స్. 100’ ఫేమ్ పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటిస్తోంది. సునీల్ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ‘హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఫస్ట్ గ్లాన్స్ ఆది సాయి కుమార్ బర్త్ డే కానుకగా రిలీజ్ చేయగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిందని, సాయి కార్తీక్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాలో హైలైట్ అవుతుంద’ని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. ఈ చిత్రంలో అనూప్ సింగ్ ఠాకూర్, కబీర్ సింగ్, పూర్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు.