వాయిదాల మీద వాయిదా పడిన తర్వాత ఎట్టకేలకు విరాటపర్వం ఈ శుక్రవారం (జూన్ 17) ప్రేక్షకుల ముందుకొచ్చింది. రానా దగ్గుబాటు, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ సినిమా, ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం సక్సెస్‌మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా నిర్మాత సురేశ్ బాబు మాట్లాడుతూ.. ఈ సినిమా తప్పకుండా చూడాల్సిందేనని, ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కాకూడదని అన్నారు.
‘‘ఇది (విరాటపర్వం) నా బ్యానర్‌లో వచ్చిన మొదటి బయోపిక్. ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో సాయి పల్లవి, రానా అద్భుతంగా నటించారు. అందుకు వారిని ప్రత్యేకంగా అభినందించాల్సిందే! దర్శకుడు వేణు ఊడుగుల రాసిన డైలాగ్స్ హార్డ్ హిట్టింగ్‌గా ఉన్నాయి, అతని నరేషన్ మెచ్చుకోదగింది’’ అని సురేశ్ బాబు చెప్పారు. చివర్లో తన ప్రసంగాన్ని ముగిస్తూ.. ఇది మనసుతో తీసిన సినిమా అని, దీనిని కచ్ఛితంగా మిస్ కాకూడదని, తప్పకుండా చూడాల్సిందేనని చెప్పుకొచ్చారు.
కాగా.. ఈ సినిమాలో సాయి పల్లవి కనబర్చిన ప్రదర్శనకు గాను సర్వత్రా ప్రశంసలు వచ్చిపడుతున్నాయి. అవార్డ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్‌తో మనసులు దోచుకుందని క్రిటిక్స్ సహా ప్రేక్షకులు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. రానా సైతం నక్సలైట్ పాత్రలో జీవం పోశాడని కొనియాడుతున్నారు. బాక్సాఫీస్ వద్ద కూడా ఈ సినిమా ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాబడుతోందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.