నటశేఖర కృష్ణ, అందాలరాశి శ్రీదేవి జంటగా నటించిన అనేక చిత్రాలు తెలుగువారిని అలరించాయి. శ్రీదేవి సరసన అత్యధిక చిత్రాలలో హీరోగా నటించిన క్రెడిట్ కృష్ణకే దక్కుతుంది. ‘బుర్రిపాలెం బుల్లోడు’తో ఆరంభమైన కృష్ణ, శ్రీదేవి జోడీ తరువాత దాదాపు పాతిక చిత్రాలలో కనువిందు చేసింది. వారిద్దరూ నటించిన చిత్రాలలో ‘కిరాయి కోటిగాడు’ కూడా భలేగా సందడి చేసింది. ఈ చిత్రానికి ముందు కృష్ణ-శ్రీదేవి జంటగా “బుర్రిపాలెం బుల్లోడు, ఘరానాదొంగ, మామాఅల్లుళ్ళ సవాల్, అదృష్టవంతుడు, చుట్టాలున్నారు జాగ్రత్త, బంగారు బావ, గడసరి అత్త- సొగసరి కోడలు, బంగారుభూమి, బంగారు కొడుకు, కృష్ణార్జునులు, ప్రేమనక్షత్రం, కృష్ణావతారం, కలవారి సంసారం, ఊరంతా సంక్రాంతి” వంటి చిత్రాలు జనం ముందు నిలిచాయి. కృష్ణ-శ్రీదేవి హిట్ మూవీస్ లో ఒకటిగా ‘కిరాయి కోటిగాడు’ నిలచింది. 1983 మార్చి 17న ‘కిరాయి కోటిగాడు’ విడుదలై విజయం సాధించింది.
‘కిరాయి కోటిగాడు’ కథను పరిశీలిస్తే, రాజేశ్ ఖన్నా నటించిన ‘దుష్మన్’ ఛాయలు కనిపిస్తాయి. ఆ సినిమాను తెలుగులో శోభన్ బాబు హీరోగా ‘ఖైదీ బాబాయ్’ పేరుతో రీమేక్ చేశారు. ‘కిరాయి కోటిగాడు’లో ఓ ఊరికి మేలు చేయాలనుకున్న వ్యక్తి, కిరాయి కోటిగాడు కారణంగా బలిఅవుతాడు. అప్పుడు అతని కుటుంబానికి, ఊరికి కోటిగాడు ఎలా సాయం చేశాడు. వారి మనసులు ఎలా గెలుచుకున్నాడు అన్నదే కథ. అసలు కథలోకి తొంగిచూస్తే – ఊరిలో ఆదిశేషయ్య, గరుడాచలం చేసే అకృత్యాలను మిలిటరీ నుండి వచ్చిన రాంబాబు ఎదిరిస్తాడు. అతణ్ణి మట్టుపెట్టాలని పంపిన రౌడీలే అతని చేతితో దెబ్బలు తినడంతో పట్నంలో కిరాయికి పనిచేసే కోటిగాడిని తీసుకువస్తారు ఆదిశేషయ్య, గరుడాచలం. అతను రాంబాబును కొడతాడు. రాంబాబు కాలు విరుగుతుంది. ఆ ఊరిలో అందరి మేలు కోరే గౌరి, కిరాయి కోటిగాడులో మార్పు తేవాలని అతనికి దగ్గరవుతుంది. కాలువిరిగిన రాంబాబును కొట్టి శేషయ్య, గరుడాచలంకు అప్పగిస్తాడు కోటిగాడు. వాళ్ళు అతణ్ణి చితక్కొట్టి తెప్పలో పడేసి నీళ్ళలోకి తోస్తారు. గౌరి కోటిగాడిని నిలదీస్తుంది. అతను రాంబాబును కాపాడాలని వెళతాడు. కానీ, రాంబాబు నీళ్ళలో కొట్టుకుపోతాడు. రాంబాబు తల్లి, కోటిగాడిని నానా మాటలు అంటుంది. అతనిలో మార్పు వస్తుంది. రాంబాబు ఇంటికి మేలు చేయాలని తపిస్తాడు కోటిగాడు. మొదట్లో రాంబాబు తల్లి, చెల్లి అతణ్ణి అనుమానిస్తారు. కానీ, గౌరీ అతనిలో మార్పు చూస్తుంది. నిజంగానే ప్రేమిస్తుంది. శేషయ్య కిరాయి కోటిగాడు మారిపోయాడని తెలుసుకొని, అతనిపై నేరం మోపి జైలుకు పంపిస్తాడు. కోటిగాడు తప్పించుకు వచ్చి, తన వాళ్ళను శేషయ్య బారి నుండి రక్షిస్తాడు. ఊరి జనం సైతం శేషయ్య మనుషులపై తిరగబడతారు. శేషయ్యనూ అరెస్ట్ చేస్తారు. కోటిగాడిపై మోపిన నేరం అతడు చేయలేదని కోర్టు నమ్ముతుంది, అతడిని నిర్దోషిగా విడుదల చేయడంతో కథ సుఖాంతమవుతుంది.
ఈ చిత్రంలో రావు గోపాలరావు, అల్లు రామలింగయ్య, శ్రీధర్, గిరిబాబు, అరుణ, జయమాలిని, నిర్మల, జయవిజయ, శ్రీలక్ష్మి, లావణ్య, పి.జె.శర్మ, సుత్తివేలు నటించారు. సత్యమూర్తి కథకు, సత్యానంద్ మాటలు పలికించారు. వేటూరి సుందరరామమూర్తి పాటలకు, చక్రవర్తి స్వరకల్పన చేశారు. ఇందులోని “నమస్తే సుస్వాగతం…”, “కూడబలుక్కుని కన్నారేమో…”, “ఎక్కితొక్కి నీ అందం…”, “పట్టుమీదున్నాది…”, “చీకటెప్పుడవుతుందో…” అంటూ సాగే పాటలు అలరించాయి.
కృష్ణకు వీరాభిమాని అయిన నందిగం రామలింగేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. నందిగం దేవి ప్రసాద్ సమర్పణలో రామ్ ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రానికి ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మంచి విజయం సాధించి, శతదినోత్సవం జరుపుకుంది. ఈ సినిమా తరువాత కృష్ణ, శ్రీదేవి జంటగా రామలింగేశ్వరరావు ‘కంచుకాగడా’ వంటి భారీ చిత్రం నిర్మించారు. ఆ తరువాత కూడా కృష్ణ హీరోగా కొన్ని సినిమాలు తెరకెక్కించారు. కృష్ణ తనయుడు మహేశ్ హీరోగా ఇదే రామలింగేశ్వరరావు ‘మురారి’ నిర్మించి విజయం సాధించారు.