ఎమ్మెస్ రాజు.. ఒకప్పుడు బ్లాక్ బస్టర్ సినిమాల నిర్మాత. ‘ఒక్కడు’, ‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ లాంటి సూపర్ హిట్ సినిమాల్ని ఆయన నిర్మించారు. అలాంటి ఆయన ఆ తర్వాతి కాలంలో నష్టాల్లో కూరుకుపోయారు. పెద్ద హీరోలతో తిరిగి సినిమాల్ని నిర్మించలేని దుస్థితికి చేరుకున్నారు. చివరగా.. ఈయన నిర్మించింది ‘మస్కా’. ఇప్పుడు దర్శకుడిగా సినిమాలు చేస్తూ వస్తున్నారు కానీ, నిర్మాతగా తన ప్రస్థానాన్ని ఆపేశారు. అసలెందుకు ఎమ్మెస్ రాజుకి ఈ పరిస్థితి వచ్చింది? నిర్మాతగా ఎందుకు తన జర్నీని ముగించారు? అనే చర్చలు తెరమీదకి వచ్చినప్పుడు.. తనయుడు సుమంత్ అశ్విన్ తో చేసిన సినిమాలు తేడా కొట్టడం వల్లేనని కామెంట్స్ వచ్చాయి.
అయితే, అందులో ఏమాత్రం వాస్తవం లేదని తాజాగా సుమంత్ చెప్పుకొచ్చాడు. తన తండ్రి ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో చేసిన ‘‘7 డేస్ 6 నైట్స్’’ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా లేటెస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన వల్లే తండ్రి నష్టపోయారన్న వ్యాఖ్యల్ని తోసిపుచ్చాడు. ప్రభాస్ తో చేసిన ‘పౌర్ణమి’ సినిమా తేడా కొట్టడం వల్లే భారీ నష్టాలు చవిచూడాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చాడు. ‘‘వర్షం తర్వాత అదే కాంబినేషన్ లో సినిమా అనగానే భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో, మా నాన్న ఉన్నదంతా తీసుకొచ్చి ‘పౌర్ణమి’కి పెట్టేశారు. సెట్స్ కోసం భారీ స్థాయిలో ఖర్చు వెచ్చించారు. ఆ సినిమాకి ప్రశంసలైతే వచ్చాయి కానీ, బాక్సాఫీస్ వద్ద ఆడలేదు. ఆ దెబ్బకు భారీ నష్టాలు వచ్చాయి. ఆ నష్టాలు నాన్న కెరీర్ పై బాగా ఎఫెక్ట్ చూపించాయి. ఆ సినిమా పెద్ద దెబ్బే కొట్టింది’’ అని సుమంత్ వెల్లడించాడు.
ఆ తర్వాత కొత్త హీరోని పెట్టి చేసిన ‘వాన’ వల్ల కూడా నష్టాలొచ్చాయని సుమంత్ తెలిపాడు. సొంత బ్యానర్ లో తాను ఇంతవరకూ ఒక్క సినిమా కూడా చేయలేదని, అసలు తాను హీరోగా ఎంట్రీ ఇచ్చే సమయానికే తన తండ్రి నష్టాల్లో కూరుకుపోయారని అన్నాడు. కాబట్టి, తన వల్లే నాన్న నష్టపోయాడయని వచ్చిన కామెంట్స్ లో వాస్తవం లేదని సుమంత్ అశ్విన్ చెప్పుకొచ్చాడు.