Subhaleka Sudhakar: శుభలేఖ సుధాకర్ గురించి తెలుగువారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బక్కపలచని శరీరం, కళ్ళజోడు.. నున్నగా పక్కకు దువ్విన తల.. వెటకారంగా ఒక నవ్వు.. అప్పటి సినిమాల్లో ఇదే అతడి రూపం. శుభలేఖ సినిమాలో ఆయనను నటనకు గుర్తింపు రావడంతో అదే ఆయన ఇంటిపేరుగా మారిపోయింది. ఇక కెరీర్ మొదలుపెట్టినప్పటినుంచి ఇప్పటివరకు నిర్విరామంగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఇక ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం చెల్లెలు సింగర్ ఎస్పీ శైలజను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సుధాకర్.. ఒక ఇంటర్వ్యూలో పలు యూట్యూబ్ ఛానెల్స్ పై ఫైర్ అయ్యాడు. రూమర్స్ రాసి తమను చాలా ఇబ్బంది పెడుతున్నారని, సోషల్ మీడియాలో కూడా తమ గురించి తప్పుడు వార్తలు వస్తున్నాయని, వాటి వలన తాము చాలా కోల్పోయామని చెప్పుకొచ్చాడు. చిరంజీవితో తనకు విబేధాలు ఉన్నాయని, శైలజ, తాను విడిపోయామని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పుకొచ్చాడు.
” చిరంజీవి, నేను మంచి స్నేహితులం. ఆయనతో మంచి సాన్నిహిత్యం ఉంది. ఎస్పీబీ గారు అనారోగ్యంతో ఉన్నప్పుడు 54 రోజులు నిత్యం ఆయన నాకు కాల్ చేసి క్షేమ సమాచారాలు అడిగేవారు. చిరంజీవినే నా మొదటి హీరో.. ఈ యూట్యూబ్ వాళ్లు ఏవేవో రాతలు రాసుకొచ్చారు. దీని తరువాత.. నా భార్య శైలజతో నేను విడాకులు తీసుకున్నట్లు కొన్ని వీడియోలు పెట్టారు. ఒకరోజు ఆ వీడియోలు చూసిన మా అమ్మ.. మా ఇద్దరినీ పిలిచి మీ ఇద్దరిమధ్య గొడవలు ఉన్నాయా అని అడిగింది. అలాంటిదేం లేదని చెప్పాము. ఆ తెల్లారి ఆమె మరణించారు. ఆ పరిస్థితిలో మేము ఏం అనుకోవాలి. ఎంతటి మానసిక క్షోభను అనుభవించామో మాకే తెలుసు. ఇలాంటి వీడియోలతో యూట్యూబ్ ఛానల్స్ వారికి ఏమి కలిసి వస్తుంది..? ఈ ప్రపంచంలో అత తక్కువ వృత్తి అంటే ఒక స్త్రీ తన శరీరాన్ని అమ్ముకుని సంపాదించడమే అని నేను అనుకుంటాను. కనీసం వాళ్లకు ఎథిక్స్ అయినా ఉంటాయి.. వీరికి అవి కూడా ఉండవు. ఇంకొంతమంది అయితే నేను చనిపోయాను అని వీడియోలు పెట్టారు. నన్ను చంపేస్తే వాళ్లకు ఏం కలిసి వస్తుంది. అలాంటి వారికి నేను ఏం ద్రోహం చేశాను. వారి పొట్ట నింపుకోవడానికి ఇలాంటి రాతలు రాసి.. ఎదుటివాళ్లను చంపి.. డబ్బు సంపాదిస్తే వాళ్లకు అరుగుతుందా ..?” అంటూ ఎమోషనల్ అయ్యాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.