‘రీమేక్స్ కింగ్స్’ అంటూ కొందరు ఉంటారు. వారిలో రీమేక్స్ తో హిట్స్ పట్టేసిన నటీనటులు ఉండవచ్చు, దర్శకనిర్మాతలూ చోటు సంపాదించ వచ్చు. ఇక సాంకేతిక నిపుణులకూ స్థానం దక్కవచ్చు. అలా రీమేక్స్ లో కింగ్స్ గా నిలచినవారిలో దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు ఒకరు. ఆయన తెరకెక్కించిన 13 సినిమాలలో ఒకే ఒక్క సినిమా మినహాయిస్తే, అన్నీ పునర్నిర్మిత చిత్రాలే కావడం విశేషం. తొలి చిత్రం ‘శుభమస్తు’ మళయాళ చిత్రానికి రీమేక్ కాగా, రెండో సినిమా ‘శుభాకాంక్షలు’ తమిళ చిత్రం ‘పూవే ఉనక్కాగ’ ఆధారంగా తెరకెక్కింది. ఈ సినిమా 1997 ఫిబ్రవరి 14న విడుదలై మంచి విజయం సాధించింది. ఈ చిత్రాన్నిఆర్.బి.చౌదరి సమర్పణలో శ్రీసాయిదేవా ప్రొడక్షన్స్ పతాకంపై ఎన్. వి. ప్రసాద్, శానం నాగ అశోక్ కుమార్ నిర్మించారు. తన తొలి చిత్రం ‘శుభమస్తు’ కథానాయకుడు జగపతిబాబుతోనే ఈ సినిమాను తెరకెక్కించి విజయం సాధించారు భీమనేని శ్రీనివాసరావు.
మనసులు కదిలించే కథ!
“ప్రేమంటే ఏమిటి? అన్న ప్రశ్నకు చాలామంది రెండు మనసుల కలయిక” అని సమాధానం చెబుతూ ఉంటారు. కానీ, ప్రేమించే ప్రతి మనసులోనూ చిందులు వేసేదే ప్రేమ! అసలైన ప్రేమ ఏ తీరున సాగుతుందో చాటుతూ ‘శుభాకాంక్షలు’ చిత్రం తెరకెక్కింది. ఒకప్పుడు ఎంతో అన్యోన్యంగా ఉన్న సీతారామయ్య, స్టీవెన్ అనే మిత్రులు బద్ధ శత్రువులై పోతారు. అందుకు కారణం స్టీవెన్ కొడుకు రాబర్ట్, సీతారామయ్య కూతురు సీతను ప్రేమించి పెళ్ళి చేసుకోవడమే. కన్నవారిని ఎదిరించి, పెళ్ళిచేసుకోవడానికి ఉన్న ఊరిని వదిలి వెళ్తారు. అప్పటి నుంచీ స్టీఫెన్, సీతారామయ్య కుటుంబాల మధ్య వైరం నెలకొని ఉంటుంది. కన్నవారిపై మమకారం ఉన్నా, సీతారామయ్య తనయుడు బలరామయ్యను చూసి భయపడుతూ ఉంటాడు. అలాగే స్టీవెన్ తన కొడుకు మోజెస్ ను చూసి జంకుతూ ఉంటాడు. ఇలా సాగుతుండగా, వారి మనవడు చందు, తన మిత్రుడు గోపితో కలసి ఆ ఊరికి వస్తాడు. రెండు కుటుంబాలు అతణ్ణి చేరదీయవు. కానీ, పెద్దవారు తమ మనవడిని చూసుకోవాలని తపిస్తారు. బలరామ్, మోజెస్ హెచ్చరికతో ఆ ఊరిలో చందుకు ఎవరూ ఇల్లు అద్దెకు ఇవ్వరు. కానీ, నాదబ్రహ్మం అనే గాయకుడు వారికి అద్దెకిస్తాడు. కొన్నాళ్ళకు తమ మనవడికి పెళ్ళి చేయాలని చందు అమ్మమ్మ, నాన్నమ్మ భావిస్తారు. కానీ, చందు తనకు పెళ్లయిందని, భార్యపేరు నిర్మలా మేరి అని చెబుతాడు. కొద్దిరోజులకే నిర్మలా మేరి వస్తుంది. చందు అసలు ఆమె ఎవరో తనకు తెలియదంటాడు. అయితే మిత్రుని సలహాతో నిజమైన భార్యనే అని ఆమెను బలవంత పెట్టినట్టు నటిస్తాడు. అందుకు నిర్మలా మేరి సతమతమవుతుంది. అప్పుడు ఓ ఫోటో చూపించి, వీళ్ళెవరో తెలుసా అని నిర్మల, చందును అడుగుతుంది. నీవెవరి కొడుకునని చెప్పుకు తిరుగుతున్నావో, వాళ్ళే వీళ్ళని చెబుతుంది. వారికి అసలు మగబిడ్డేలేడని, వారికున్న ఏకైక పుత్రిక తానేనని అంటుంది.
అప్పుడు తానెందుకు అలా చేశాడో వివరిస్తాడు చందు. తానో అనాథనని, తాముండే పూరి గుడిసె పక్కనే ఓ లేడీస్ హాస్టల్ ఉండేదని, అందులో నందిని అమ్మాయితో స్నేహం కలిసిందని అంటాడు.
నందిని, చందును ఎంతో స్నేహంగా చూస్తుంది. ఆమె స్నేహం ప్రేమగా భావిస్తాడు చందు. అయితే నందిని, తాను ప్రేమించే లారెన్స్ ను వారికి పరిచయం చేస్తుంది. అయితే వారి ప్రేమపెళ్ళికి తమ పెద్దలు అంగీకరించరని, అందుకు కారణం ఒకప్పుడు తమ అత్తయ్య, అతని బాబాయ్ పెళ్ళి చేసుకోవడమేనని తెలుపుతుంది నందిని. ప్రేమ బంధాలను పెంచాలే కానీ, తుంచకూడదని నందినికి చెబుతాడు. వారి రెండు కుటుంబాలను ఎలాగైనా కలుపుతానని చెబుతాడు. అలా తాను ఆ ఊరికి వచ్చానని చందు వివరిస్తాడు. నందిని, లారెన్స్ ప్రేమ వారి పెద్దలకు తెలుస్తుంది. వారిని కొట్టబోతే చందు అడ్గు పడతాడు. చందును అటు బలరామ్, ఇటు మోజెస్ చితక బాదుతూ ఉంటారు. అదే సమయంలో నందిని క్రిస్టియన్ బ్రైడ్ డ్రెస్ లోనూ, లారెన్స్ నుదుటన బొట్టు పెట్టుకొని జుబ్బా, పంచెకట్టుతోనూ కారు దిగుతారు. కానీ, వారు పెళ్ళి చేసుకోలేదని పెద్దల అనుమతి కోసమే మతాలు మారారని వివరిస్తాడు చందు. దాంతో అందరి మనసులు మారతాయి. మళ్ళీ ఆ రెండు కుటుంబాలు ఒకటవుతాయి. ఎంతో ఆనందంగా నందిని, లారెన్స్ పెళ్ళి చేస్తారు. ఆ పెళ్ళికి సీత, రాబర్ట్ వస్తారు. వారి ద్వారా అసలు విషయం తెలుసుకుంటారు. చందుకు, నిర్మలాను ఇచ్చి పెళ్ళి చేయాలనుకుంటారు. చందును తాను ఒప్పిస్తానని చెబుతుంది నందిని. అయితే చందు ఆ పెళ్ళి తనకు ఇష్టం లేదని అంటాడు. ఎందుకంటే, తానో అమ్మాయిని ప్రేమించానని, ఆమెకు పెళ్ళయిపోయిందని తెలుపుతాడు. మీరు కూడా పెళ్ళి చేసుకోండని నందిని అంటుంది. “ప్రేమ అనేది భాషకందని భావం. ఆ భావం ఒక్కసారి మనసును తాకితే, అది మరచిపోవడం కష్టం” అని చెబుతాడు చందు. ఈ నిర్ణయం బాధ కలిగించవచ్చు, కానీ, తనకు మాత్రం ఆ బాధ కూడా ఆనందాన్నిస్తుందని చెప్పి చందు అంటాడు. ఇదంతా తలుపు చాటునుంది విన్న నిర్మల కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. చందు ఒంటరిగా తన ఊరికి వెళ్తూ ఉండడంతో కథ ముగుస్తుంది.
తమిళంలో విక్రమన్ రాసిన కథను తెలుగులో రమేశ్-గోపి, చింతపల్లి రమణ రచనా సహకారంతో తీర్చిదిద్దారు. ఈ సినిమాకు తోటపల్లి మధు మాటలు పలికించారు. కోటి స్వరకల్పనలో పాటలు రూపొందాయి. “ఓ పోరీ పానీ పూరీ…” పాటను భువనచంద్ర రాయగా, “ఆనందమానందమాయె… మది ఆశల నందనమాయె…” పాటను రెండు వర్షన్స్ లో సామవేదం షణ్ముఖ శర్మ రాశారు. “గుండె నిండా గుడిగంటలు…”, “మనసా పలుకవే మధుమాసపు కోయిలవై…” (రెండు వర్షన్స్), “పంచవన్నెల చిలకా..”, “అద్దంకి చీరె…” అంటూ సాగే పాటలను సీతారామశాస్త్రి పలికించారు.
అప్పట్లో హీరో కృష్ణ అనేక చిత్రాలలో పాటల్లో ప్రత్యేకంగా కనిపించి అలరించారు. ఇందులో “పంచవన్నెల చిలక నన్ను ఎంచుకుందిరా…” పాటలో కృష్ణ, రంజిత స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వడం విశేషం! ఈ చిత్రం ద్వారానే రాశి నాయికగా పరిచయం అయ్యారు. ఇందులో రవళి, సుధాకర్, సత్యనారాయణ, నగేశ్, దేవన్, ఆనంద్ రాజ్, బ్రహ్మానందం, ఏవీయస్, మల్లికార్జునరావు, మహర్షి రాఘవ, షావుకారు జానకి, సుకుమారి, సుధ, వై.విజయ, రజిత, ఆల్ఫోన్సా నటించారు.
‘శుభాకాంక్షలు’ చిత్రం ఘనవిజయం సాధించింది. ఈ సినిమాతో జగపతిబాబుకు మరో హిట్ దక్కింది. రవళి, రాశికి మంచి పేరు లభించింది. ఈ చిత్రం తరువాతనే రాశికి పవన్ కళ్యాణ్ తో ‘గోకులంలో సీత’లో నటించే అవకాశం దక్కింది.