కరూర్‌లో టివికే పార్టీ అధినేత, నటుడు విజయ్ నిర్వహించిన ర్యాలీ ఘోర విషాదానికి దారితీసింది. ర్యాలీ సందర్భంగా చోటుచేసుకున్న తొక్కిసలాటలో మృతుల సంఖ్య 39కి పెరిగింది. ప్రస్తుతం 58 మంది తీవ్రంగా గాయపడి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఘటన అనంతరం సీఎం స్టాలిన్ గాయపడిన వారిని ఆస్పత్రిలో పరామర్శించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ, చనిపోయిన వారికి రూ.10 లక్షలు, గాయపడిన వారికి రూ.1 లక్ష పరిహారం ప్రకటించారు. అలాగే తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. విశ్రాంత న్యాయమూర్తి అరుణ జగదీశన్ ఆధ్వర్యంలో విచారణ జరగనుంది.
పోలీసుల వివరన ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకు జరగాల్సిన ర్యాలీ 7 గంటల ఆలస్యంగా ప్రారంభమైంది. ఆహారం, తాగునీరు లేకపోవడంతో అనేక మంది కార్యకర్తలు స్పృహ కోల్పోయారు. అంబులెన్స్‌కు దారి లేకపోవడంతో పరిస్థితి మరింత విషమించింది. ర్యాలీలో విజయ్ ప్రసంగం మధ్యలో రెండు సార్లు ఆగిపోయింది. ఒకసారి తాగునీటి కోసం, మరొకసారి తప్పిపోయిన చిన్నారిని వెతికేందుకు కోరాడు. ఈ గందరగోళం కూడా తొక్కిసలాటకు దారి తీసిందని పోలీసులు పేర్కొన్నారు. పరిస్థితి అదుపు తప్పడంతో లాఠీ ఛార్జ్ చేయాల్సి వచ్చిందని తెలిపారు. ఈ ఘటనపై సీనియర్ నటుడు శరత్‌కుమార్ తీవ్రంగా స్పందించారు..“కరూర్ మరణాలకు విజయ్ పూర్తి బాధ్యత వహించాలి. పోలీసుల సూచనలు పట్టించుకోకుండా ర్యాలీ నిర్వహించడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. విజయ్ గర్వం ఇంతమంది ప్రాణాలు బలి తీసుకుంది” అని ఆరోపించారు.