ఒకట్రెండు హిట్లు పడ్డాక నటీనటులు తమ పారితోషికం పెంచడం సహజమే! కాకపోతే ఒకేసారి భారీగా పెంచేయరు. గత సినిమాతో పోలిస్తే, ఒక మోస్తరు ఫిగర్ పెంచుతారు. అమాంతం పెంచేస్తే ఆఫర్లు తగ్గుముఖం పడతాయి కాబట్టి, సినిమా సినిమాకి క్రమంగా పెంచుకుంటూ పోతారు. కానీ.. కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి మాత్రం భారీగా పెంచేసింది. స్టార్ హీరోయిన్లకు మించి కాస్త ఎక్కువ డబ్బులే ఇవ్వాలని నిర్మాతలపై ఒత్తిడి పెంచుతోందట! తాను నటించిన ‘కేజీఎఫ్’ సిరీస్ భారీ విజయం సాధించడం వల్లే ఈ అమ్మడు ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తోందని సమాచారం!
‘కేజీఎఫ్: చాప్టర్1’తో పెద్దగా గుర్తింపు రాలేదు కానీ.. ‘కేజీఎఫ్: చాప్టర్2’ పాన్ ఇండియా లెవెల్‌లో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించడంతో శ్రీనిధికి మంచి క్రేజ్ వచ్చింది. అందుకే.. దక్షిణాది స్టార్ హీరోయిన్లకు ఇస్తోన్న అమౌంట్ కంటే నాలుగు లక్షలు ఎక్కువ ఇవ్వాల్సిందేనని శ్రీనిధి అడుగుతోందట! మరి, ఇది నిజమా? కాదా? క్లారిటీ తీసుకోవడం కోసం రీసెంట్ ఇంటర్వ్యూలో యాంకర్ ‘మీకు డబ్బు కావాలా? పేరు కావాలా?’ అంటూ ఓ ప్రశ్న సంధించాడు. అందుకు ఆమె నిర్మొహమాటంగా తనకు డబ్బే ముఖ్యం అంటూ కుండబద్దలయ్యే సమాధానం ఇచ్చింది. దీన్ని బట్టి.. ఈమె భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్టు వస్తున్న వార్తలు వాస్తవమేనన్నమాట!