విష్ణు, కేథరిన్ థ్రెసా, ‘కేజీఎఫ్’ ఫేమ్ రామచంద్రరాజు ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘భళా తందనాన’. చైతన్య దంతులూరి దర్శకత్వంలో వారాహి చలన చిత్రం బ్యానర్ లో రజనీ కొర్రపాటి ఈ చిత్రం నిర్మించారు. అన్ని అనుకున్నట్టు జరిగి ఉంటే ఈ సినిమా ఈ నెల 30న విడుదల కావాల్సింది. కానీ దీన్ని మే 6కి వాయిదా వేశారు దర్శకనిర్మాతలు. ఈ విషయాన్ని దర్శకుడు చైతన్య దంతులూరి చెబుతూ, ”వైవిధ్యమైన కథాంశాంతో తెరకెక్కిన ఈ సినిమాను సమ్మర్ స్పెషల్ గా రిలీజ్ చేస్తున్నాం. ఈ వారం రోజులు మూవీ ప్రమోషన్స్ పై దృష్టి పెడతాం. మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమాలోని మొదటి రెండు లిరికల్ వీడియోలకు మంచి స్పందన లభించింది. ఈ చిత్రం టీజర్ అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొని సినిమాపై అంచనాలు పెంచింది” అని అన్నారు. శ్రీకాంత్ విస్సా రచయిత గా, సురేష్ రగుతు సినిమాటోగ్రఫర్ గా, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా, గాంధీ నడికుడికర్ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేసిన ఈ చిత్రానికి టాప్ స్టంట్ డైరెక్టర్ పీటర్ హెయిన్ యాక్షన్ స్టంట్స్ అందించారు.
విశేషం ఏమంటే… ఏప్రిల్ 22న విడుదల కావాల్సిన ‘జయమ్మ పంచాయితీ, అశోక వనంలో అర్జున కళ్యాణం’ చిత్రాలు సైతం మే 6వ తేదీకే వాయిదా పడ్డాయి. అలానే కోర్టు కేసు కారణంగా విడుదల కాకుండా ఆగిన రామ్ గోపాల్ వర్మ ‘మా ఇష్టం’ మూవీ కూడా మే 6నే రిలీజ్ అవుతోంది. ఇక ఆంగ్ల అనువాద చిత్రం ‘డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ మల్టిపెర్స్ ఆఫ్ మాడ్ నెస్’ కూడా అదే రోజు జనం ముందుకు రాబోతోంది. సో… ఇప్పటికే మే 6వ తేదీకి ఐదు చిత్రాలు కర్చీఫ్ వేసి పెట్టాయి. ఇంకా ఏ యే సినిమాలు ఈ జాబితాలో చేరతాయో చూడాలి.