(అక్టోబర్ 17న ‘పవిత్ర బంధం’కు 25 ఏళ్ళు)
తెలుగు చిత్రసీమలో ప్రేక్షకులకు కన్నుల పండుగ చేసిన జంటల్లో వెంకటేశ్ – సౌందర్య జోడీనీ తప్పకుండా చేర్చాలి. వారిద్దరూ కలసి నటించిన అనేక చిత్రాలు బాక్సాఫీస్ బరిలో బంపర్ హిట్స్ గా నిలిచాయి. వాటిలో ‘పవిత్రబంధం’ ఒకటి. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో సి.వెంకట్రాజు, జి. శివరాజు నిర్మించిన ఈ చిత్రంలో ‘కాంటాక్ట్ మ్యారేజ్’ అన్నది ప్రధానాంశం. 1996 అక్టోబర్ 17న దసరా కానుకగా విడుదలైన ‘పవిత్ర బంధం’ ఘనవిజయం సాధించింది. ఈ చిత్రానికి పాతికేళ్ళ ముందు అంటే 1971లో ఏయన్నార్, వాణిశ్రీ జంటగా ఓ ‘పవిత్రబంధం’ రూపొందింది. అయితే ఆ చిత్రానికి, ఈ సినిమాకు కథలో ఏ లాంటి పోలిక లేదు.
ఈ ‘పవిత్రబంధం’లో కథ ఏమిటంటే- విశ్వనాథ్ అనే కోటిశ్వరునికి ఒక్కాగానొక్క కొడుకు విజయ్. అతను విదేశాల్లో చదువుకొని అక్కడే చాలా కాలం ఉండడం వల్ల అక్కడి సంప్రదాయాలు వంటపట్టించుకొని ఉంటాడు. తండ్రి పెళ్ళి చేసుకోమని పోరితే, ఎవరినైనా ‘కాంటాక్ట్ మ్యారేజ్’ చేసుకుంటానని చెబుతాడు. అలా ఎవరూ అంగీకరించరని తండ్రి ఎంత చెప్పినా వినడు. విశ్వనాథ్ తన ఆఫీసులో పనిచేసే రాధ అనే అమ్మాయికి ఈ విషయం చెబుతాడు. ఆమె తన కుటుంబ పరిస్థితి కారణంగా ఆ పెళ్ళికి అంగీకరిస్తుంది. విశ్వనాథ్ కొడుకు విజయ్ ను పెళ్ళి చేసుకోగానే, రాధ ఇంట్లో ఆమె అన్నయ్యకు ఉద్యోగం వస్తుంది. అక్క కాపురం నిలుస్తుంది. విజయ్ కు ఓ ప్రమాదం జరిగినప్పుడు భార్యగా రాధ సేవలు చేస్తుంది. అతను కోలుకోవాలని దేవుళ్ళకు మొక్కుకుంటుంది. అయితే విజయ్ మాత్రం కేవలం ఒక్క సంవత్సరం కాంటాక్ట్ పెళ్ళిలో భార్యగానే ఆమెను చూస్తాడు. ఏడాది గడవగానే విడిపోతాడు. ఆమె ఇంటికి వెళ్తుంది. ఎప్పటిలాగే విశ్వనాథ్ కంపెనీలో పనిచేస్తూ ఉంటుంది. తరువాత భార్య గొప్పతనం తెలిసి విజయ్ పశ్చాత్తాపం చెందుతాడు. ఆమెకు దగ్గర కావాలని ప్రయత్నిస్తాడు. కానీ, అదంతా నాటకం అని భావిస్తుంది రాధ. కొద్ది రోజులకు రాధ గర్భవతి అని తెలుస్తుంది. విజయ్, విశ్వనాథ్ ఎంతో ఆనందిస్తారు. రాధ కన్నవారు సీమంతం చేస్తారు. అక్కడకు విజయ్, విశ్వనాథ్ వెళ్తారు. విజయ్ ను అక్కడ అవమానిస్తుంది రాధ. అంతకు ముందు విజయ్ ను చంపాలనుకున్న ఇద్దరు దుర్మార్గులు, జైలు నుండి బయటకు వచ్చాక మళ్ళీ అతణ్ణి పొడుస్తారు. అది కూడా నాటకమని భావిస్తుంది రాధ. అయితే నిజమని తెలుసుకున్నాక నిండు చూలాలు అయిన రాధ ఏమి చేయలేదు. ఆమెను ఆసుపత్రికి తీసుకుపోవడానికి విజయ్ ఎంతగానో తపిస్తాడు. చివరకు విలన్లు ఇద్దరూ చస్తారు. రాధ పండంటి బిడ్డకు జన్మనిస్తుంది. విజయ్, రాధ మళ్ళీ కలుసుకోవడంతో కథ సుఖాంతమవుతుంది.
భూపతి రాజా రాసిన ‘పవిత్రబంధం’ కథకు పోసాని కృష్ణమురళి సంభాషణలు రాశారు. దర్శకుడు ముత్యాల సుబ్బయ్య తనదైన మార్కుతో కథనం పండించారు. ఈ చిత్రానికి ఎమ్.ఎమ్.కీరవాణి సంగీతం సమకూర్చారు. సీతారామశాస్త్రి, భువనచంద్ర పాటలు రాశారు. సీతారామశాస్త్రి రాసిన “అపురూపమైనదమ్మ ఆడజన్మా…” పాట ఏసుదాసు నోట పలికి అమృతం చిలికింది. “మాయదారి అందమా…”, “చలి కొడతాంది…”, “పాటంటే పాట కాదు…”, “ఓ మై డాడీ నే విన్నా ఓ తియ్యని మాట…” వంటి పాటలూ అలరించాయి. ఈ చిత్రంలో ప్రముఖ హిందీ గాయని ఆషా భోస్లే తెరపై సంగీతవిభావరిలో పాటపాడుతూ కనిపిస్తారు. ఆమె నోట “ఐసలకిడి… అమ్మమ్మ ఏం వేడి…” అనే పాట సాగింది.
‘పవిత్రబంధం’ చిత్రం మొదటి ఆట నుంచీ గుడ్ టాక్ సంపాదించింది. దాంతో దసరా పండగ నాటికి మంచి వసూళ్ళు చూసింది. అనేక కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది. ఉత్తమ చిత్రంగా ‘పవిత్రబంధం’ బంగారునందిని అందుకుంది. సౌందర్య ఉత్తమనటిగా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఉత్తమ సహాయనటునిగా నంది అవార్డులు సొంతం చేసుకున్నారు. ఈ చిత్రం తరువాతి రోజుల్లో ఆరు భాషల్లో రీమేక్ అయింది. ఒరియాలో ‘సుహాగ్ సింధూర’గానూ, కన్నడలో ‘మాంగళ్యం తంతునానేన’గానూ రీమేక్ కాగా, హిందీలో ‘హమ్ ఆప్కే దిల్ మే రెహతే హై’గా రూపొంది విజయం సాధించింది. ఈ హిందీ చిత్రాన్ని వెంకటేశ్ తండ్రి డి.రామానాయుడు నిర్మించడం విశేషం. ఇందులో కాజోల్, అనిల్ కపూర్ జంటగా నటించారు. బంగ్లాదేశ్ లో ‘యే బాదోం జబెనా ఛెరే’ పేరుతోనూ, తమిళంలో ‘ప్రియమానవలే’గా, బెంగాలీలో ‘సాత్ పాకే బంధ’గా పునర్నిర్మితమైంది. అన్ని చోట్లా జనాన్ని ఆకట్టుకుందీ కథ.