నందమూరి బాలకృష్ణ కెరీర్ లో 1986వ సంవత్సరం మరపురానిది. ఆ యేడాది ఆయన నటించిన ఏడు చిత్రాలలో మొదటి సినిమా పరాజయం పాలు కాగా, తరువాత వచ్చిన ఆరు సినిమాలు వరుసగా విజయకేతనం ఎగురవేశాయి. ఈ యేడాది బాలయ్య నటించిన “ముద్దుల క్రిష్ణయ్య, సీతారామకళ్యాణం, అనసూయమ్మగారి అల్లుడు” చిత్రాల ఘనవిజయం తరువాత దక్కిన నాల్గవ విజయం ‘దేశోద్ధారకుడు’. ఆ తరువాత ‘కలియుగ కృష్ణుడు, అపూర్వ సహోదరులు’ వచ్చి విజయం సాధించాయి. బాలకృష్ణ, విజయశాంతి జంటగా రూపొందిన ‘దేశోద్ధారకుడు’ చిత్రానికి ఎస్.ఎస్. రవిచంద్ర దర్శకుడు. డి.మురళీమోహనరావు నిర్మాత. గొల్లపూడి మారుతీరావు అందించిన కథకు, సత్యానంద్ మాటలు సమకూర్చిన ఈ చిత్రానికి చక్రవర్తి స్వరకల్పన చేశారు. వేటూరి రాసిన అన్ని పాటలూ జనాన్ని విశేషంగా ఆకట్టుకున్నాయ. 1986 ఆగస్టు 7న విడుదలైన ‘దేశోద్ధారకుడు’ బాక్సాఫీస్ ను షేక్ చేసింది.
ఇంతకూ ‘దేశోద్ధారకుడు’ కథ ఏమిటయ్యా అంటే – ఓ ఊళ్ళో అల్లరి చిల్లరగా తిరిగే గోపీ, తాత మరణంతో చెల్లి పెళ్ళి చేయాలని బయలు దేరతాడు. అనుకోకుండా ఓ ఊరిలో నీళ్ళు తాగడానికి అని దిగితే, ట్రైన్ వెళ్ళి పోతుంది. అతనిని తమ ఊరికి వచ్చిన స్పెషల్ ఆఫీసర్ గా భావించి, ఊళ్ళోని రెండు వర్గాలకు చెందిన మనుషులు తీసుకు పోతారు. అదే ఊరి అమ్మాయి విజయ ఒకప్పుడు గోపీ గ్రామానికి వెళ్ళి ఉంటుంది. ఆమెకు గోపీ ఎవరో తెలుసు. గోపీని నిలదీయాలని వస్తుంది. కానీ, గోపీని ఆఫీసర్ గానే కొనసాగమని చెబుతుంది. రెండు వర్గాల పెద్దలతో గోపీ ఎప్పటికప్పుడు ఊరి కోసం మంచిపనులు చేయిస్తూంటాడు. చివరకు గోపీ అసలు ఆఫీసర్ కాదని విలన్లకు తెలుస్తుంది. ఇద్దరూ ఒక్కటై గోపీని, విజయను, వాళ్ళ కుటుంబసభ్యులను మట్టుపెట్టాలనుకుంటారు. గోపీ అందరినీ చిత్తు చేస్తాడు. అప్పటి దాకా ఊరిలో పిచ్చోడిగా తిరిగిన వ్యక్తి అసలు ఆఫీసర్ అని తేలుతుంది. ఊరిని పట్టి పీడించిన వారిని చట్టానికి అప్ప చెబుతారు. గోపీ నాటకమే ఆడిన జనానికి మేలు చేసిన దేశోద్ధారకుడు అని జనం కొనియాడతారు. దాంతో కథ సుఖాంతమవుతుంది.
గోపీగా బాలయ్య, విజయగా విజయశాంతి నటించిన ఈ చిత్రంలో రావు గోపాలరావు, సత్యనారాయణ, నూతన్ ప్రసాద్, గొల్లపూడి, కాంతారావు, సుధాకర్, బాలాజీ, సుత్తి వీరభద్రరావు, రాళ్ళపల్లి, మాడా, చిట్టిబాబు, ముచ్చర్ల అరుణ, వై.విజయ, సంయుక్త మిగిలిన పాత్రధారులు. ఇందులోని “ఎంతపని చేసిందమ్మా బిల్లంగోడు…”, “గగన వీధుల్లో… గాజు మేడల్లో…”, “అమ్మాయి ముద్దబంతి బుగ్గేమన్నాది…”, “పట్టుకుంటే మాసిపోయే…”, “వచ్చె వచ్చె వానజల్లు…” పాటలు జనాన్ని ఉర్రూతలూగించాయి. ముఖ్యంగా వానపాటగా చిత్రీకరించిన ‘వచ్చె వచ్చె వాన జల్లు…’ పాట అభిమానులను కుదురుగా కూర్చోనీయలేదు. ఇక ‘గగనవీధుల్లో గాజుమేడల్లో…’ పాటకోసం గోల్డ్ స్పాట్ సెట్ ప్రత్యేకంగా వేశారు. అప్పట్లో ఆ సెట్ గురించి భలేగా ముచ్చటించుకున్నారు. అనేక కేంద్రాలలో ‘దేశోద్ధారకుడు’ భారీ వసూళ్ళు చూసింది.