సూపర్ స్టార్ కృష్ణ గురించి తెలుగు అభిమానులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన లేదు. ఆయన నటించిన సినిమాలు, ఆయన చేసిన ప్రయోగాలు ఈతరంలో ఎవ్వరు చేయలేరు. ప్రస్తుతం వయో వృద్ధాప్యంతో బాధపడుతున్న ఆయన బయట ఎక్కడ కనిపించడం లేదు. ఎప్పుడో ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉంటే తప్ప ఎక్కువ మీడియా ముందు కూడా వచ్చింది లేదు. అయితే కృష్ణ జీవితంలోని ఆసక్తికరమైన విషయాలను అభిమానులు తెలుసుకొనేలా చేసింది.. కృష్ణ కూతురు మంజుల ఘట్టమనేని. మంజుల కు సొంతంగా యూట్యూబ్ ఛానెల్ ఉన్న విషయం విదితమే.. ఇక ఈ ఛానెల్ లో ఆమె కుటుంబం గురించి కొన్ని వీడియోస్ చేసి చూపిస్తూ ఉంటుంది. ఇక తాజాగా కృష్ణ తో ఒక స్పెషల్ ఇంటర్వ్యూను ప్లాన్ చేసింది. స్పెషల్ ఇంటర్వ్యూ విత్ మై సూపర్ స్టార్ నాన్న పేరుతో వస్తున్నా ఈ ఇంటర్వ్యూ ప్రోమోను మంజుల తాజాగా రిలీజ్ చేసింది. ఇక ఇంటర్వ్యూలో కృష్ణ ఎంతో హుషారుగా కనిపించారు. తన జీవితంలోని ఎత్తు పల్లాలను, బిడ్డల భవిష్యత్తు గురించి ఆయన పడిన శ్రమను చెప్పుకొచ్చారు. ముఖ్యంగా మహేష్ సక్సెస్ ను ఎంజాయ్ చేసినట్లు చెప్పుకొచ్చారు. ప్లాపులు వచ్చినప్పుడు ఎలా వాటిని అధిగమించారు.. మొట్టమొదటి సినిమాకు ఆయన ఎంత పారితోషికం తీసుకున్నారు.. కూతురు మంజుల హీరోయిన్ గా రాణించలేనప్పుడు ఆయన ఏం చేశారు అలాంటివాణ్ణి ఈ ప్రోమోలో చెప్పుకొచ్చారు.
ఇక మహేష్ ను సినిమాల్లోకి ఎలా తీసుకొచ్చారు అనేదానిమీద ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. “నాన్న మహేష్ ను మీరు చిన్నప్పుడే సూపర్ స్టార్ ను చేసేశారు.. అది మీరు ముందు ప్లాన్ చేసుకొని చేసిందా..? లేక అలా జరిగిపోయిందా..? అని మంజుల అడిగిన ప్రశ్నకు కృష్ణ మాట్లాడుతూ ” అది అలా జరిగిపోయింది.. చిన్నప్పుడు ఒక రోజు మహేష్ ను నేను షూటింగ్ కి తీసుకెళ్ళాను.. సెట్ లో షూటింగ్ జరుగుతుంటే.. ఎక్కడో ఒక మూల మెట్లు ఉంటే వాటి మీద గడ్డం కింద చేయి పెట్టుకొని కూర్చొని చూస్తున్నాడు.. నేను వెళ్లి నటిస్తావా అంటే .. నేను చేయను నేను చేయను అంటూ మారాం చేశాడు.. నువ్వు చేస్తావా..? చేయవా..? అని నేను అనేసరికి స్టూడియో మొత్తం పరుగులు పెట్టించాడు ” అని చెప్పుకొచ్చారు. ఇందుకు మంజుల అంటే మహేష్ చిన్నప్పుడే పరుగులు పెట్టించాడు కదా అంటూ నవ్వుకున్నారు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది.