బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఢిల్లీ రాజకీయాల్లో కీలకంగా మారనున్నారా ? అనే అనుమానం రాజకీయ వర్గాలతో పాటు అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. దానికి కారణం లేకపోలేదు. సోనూసూద్ ఢిల్లీ సీఎంతో భేటీ కావడం ఈ చర్చకు దారి తీసింది. శుక్రవారం ఉదయం ఢిల్లీలో సోనూసూద్, సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్య సమావేశం జరిగింది. సోనూ సూద్, సిఎం కేజ్రీవాల్ భేటీకి రాజకీయ రంగు అద్దుతున్నారు. ఈ సమావేశాన్ని పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలతో ముడిపెట్టి చూస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే ఈ సమావేశం గురించి సోనుగానీ, ఆమ్ ఆద్మీ పార్టీ గానీ ఎలాంటి విషయాన్ని బయటకు వెల్లడించలేదు. అయితే కొంతమంది మాత్రం ఆయన ఢిల్లీ ప్రభుత్వం చేపట్టబోయే ఏదైనా సంక్షేమ పథకానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండే అవకాశం ఉందంటున్నారు.
సోను సూద్ కరోనా వైరస్ మొదటి వేవ్ నుండి ప్రజలకు చేసిన సహాయం మరువలేనిది. లాక్డౌన్ సమయంలో ఇతర నగరాల్లో చిక్కుకున్న వందలాది మంది ప్రజలు తమ ఇళ్లకు చేరుకోవడానికి ఆయన సహాయం చేశాడు. సోనూ సూద్ ఇప్పటి వరకు చాలా మంది ప్రాణాలను కాపాడాడు. దీంతో ఆయన ఫేమ్ అమాంతంగా పెరిగిపోయింది. సోను సూద్ ఇప్పటి వరకు లక్షలాది మంది నిరుపేద ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు. అయితే అప్పట్లో సోనూ రాజకీయ స్వార్థం కోసమే ఇంత సేవ చేస్తున్నాడని విమర్శలు విన్పించగా, సోను స్పందిస్తూ తనకు రాజకీయాల్లో చేరాలనే ఆసక్తి ఏమాత్రం లేదని వెల్లడించాడు. కానీ ఇప్పటి పరిస్థితి చూస్తుంటే సోనూ అదంతా పక్కన పెట్టాడేమో అన్పిస్తోంది.
Read Also : “ఆర్ఆర్ఆర్” సంక్రాంతికే ఫిక్స్ ?
త్వరలో దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. సోను స్వస్థలమైన పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఇప్పటికే మంచి పట్టు ఉంది. దీంతో కేజ్రీవాల్ పార్టీ అక్కడ నుంచి గట్టి పోటీ ఇవ్వడానికి బలమైన కంటెస్టెంట్ కోసం చూస్తోంది. రాజకీయ నిపుణుల అభిప్రాయం ప్రకారం సోనూసూద్ నే వారు ఎంపిక చేసుకోనున్నారు. సోనూ సూద్ పంజాబ్ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అసలు ఈ సమావేశంలో ఏం చర్చించారో వారిద్దరి భేటీ తర్వాతే స్పష్టమవుతుంది. ఇదే జరిగితే సోనూ కూడా నటుడి నుండి నాయకుడిగా మారతాడు. అయితే ప్రస్తుతానికి సోనూ రాజకీయాల్లోకి వస్తాడా లేదా ? అనేదానిపై స్పష్టత లేదు. కానీ ప్రస్తుతం నడుస్తున్న టాక్ ప్రకారం సోనూ ఢిల్లీ రాజకీయాల్లో కీలకంగా మారాడని చెప్పొచ్చు.