అమరావతి రైతులకు నటుడు సోనూసూద్ తన మద్దతు తెలిపారు. రాష్ట్ర రాజధాని తరలింపుకు వ్యతిరేకంగా 600 రోజులకు పైగా నిరసన చేస్తున్న అమరావతి రైతులకు తాజాగా ఆంధ్రాలో పర్యటించిన సోనూసూద్ సపోర్ట్ చేశారు. మహిళలతో సహా అమరావతి నుండి కొంతమంది రైతులు సోనూసూద్ విజయవాడ సందర్శన సమయంలో ఆయనకు స్వాగతం పలకడానికి గన్నవరం విమానాశ్రయం దగ్గరకు వెళ్లారు. గురువారం 632వ రోజుకు చేరుకున్న తమ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని విమానాశ్రయం దగ్గరే సోనూసూద్ ని కోరారు.
గత సంవత్సరం కోవిడ్ -19 మహమ్మారి ప్రబలినప్పటి సోనూసూద్ కష్టాల్లో ఉన్న ప్రజలకు సహాయం అందిస్తూ వస్తున్నాడు. తాజాగా రైతుల కోరిక మేరకు తాను వారితోనే ఉన్నాను అని రైతులకు హామీ ఇచ్చాడు. రాష్ట్ర రాజధానిని విభజించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రణాళికలపై రైతులు అమరావతిలో అనేక చోట్ల నిరసన తెలిపారు. అమరావతిని ఒకే రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిపాలనా రాజధానిని విశాఖపట్నం, న్యాయ రాజధానిని కర్నూలుకు మార్చాలని, అమరావతిని శాసన రాజధానిగా నిర్ణయించింది.
సోను సూద్ కు విమానాశ్రయంలో అతని అభిమానుల నుండి ఘన స్వాగతం లభించింది. గన్నవరంలో సోనూసూద్ మీడియాతో మాట్లాడుతూ “పబ్లిక్ నిజమైన హీరో. మేము కేవలం సాధారణ వ్యక్తులం మాత్రమే”అని అన్నారు. ఆ తరువాత సోనూసూద్ నటుడు ఒక ప్రైవేట్ ఆసుపత్రిని ప్రారంభించారు. అనంతరం ఇందిరాకిలాద్రి పై కనకదుర్గమ్మను దర్శనం చేసుకున్నారు. ఆలయ పూజారులు ఆయనను ఆశీర్వదించి, ‘ప్రసాదం’, జ్ఞాపికలను అందజేశారు.