తమ కెరీర్ లో కనీసం ఒక్కసారైన దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో పని చేయాలని నటీనటులు కోరుకుంటారు. స్టార్ నటులు కూడా ఇందుకు మినహాయింపు కాదు. జక్కన్న ఓకే అంటే, కుండపోతగా తమ డేట్స్ ఇచ్చేందుకు ఎందరో సిద్ధంగా ఉన్నారు. అలాంటిది.. స్వయంగా జక్కన్నే తన వద్దకు వచ్చి ‘బాహుబలి’లాంటి ఆఫర్ చేస్తే, రిజెక్ట్ చేశాడో నటుడు. ఇంతకీ, అతనెవరని అనుకుంటున్నారా? కరోనా లాక్డౌన్ సమయంలో ఎందరో పేదవాళ్లకు సహాయం చేసి రియల్ హీరోగా అవతరించిన సోనూ సూద్. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ఒక ఇంటర్వ్యూలో రివీల్ చేశాడు.
‘‘బాహుబలి2 లోని ఒక పాత్ర కోసం రాజమౌళి నన్ను సంప్రదించారు. అయితే, డేట్ ఇష్యూస్ వల్ల ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేయాల్సి వచ్చింది. రెండో భాగం కోసం పని చేసేందుకు ఆయన చాలా డేట్స్ అడిగారు. కానీ, అప్పుడు నా చేతిలో బోలెడన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. జక్కన్న అడిగినట్టు డేట్స్ సర్దుబాటు చేయడానికి వీలు పడలేదు. దీంతో ఆ అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చింది’’ అని సోనూ సూద్ చెప్పుకొచ్చాడు. అయితే, ఏ పాత్ర ఆఫర్ చేశారన్న విషయాన్ని మాత్రం రివీల్ చేయలేదు. బహుశా సుబ్బరాజు నటించిన కుమార వర్మ పాత్రకు సోనూని అడిగి ఉండొచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఎందుకంటే.. బాహుబలి2లో ప్రభావవంతమైన పాత్ర ఏదైనా ఉందంటే, అది కుమార వర్మనే. ఆ పాత్రకు సోనూ సూద్ సెట్ అవుతాడని, మొదట అతడ్ని సంప్రదించి ఉండొచ్చని తెలుస్తోంది. అతడు రిజెక్ట్ చేశాక, సుబ్బరాజుని తీసుకొని ఉంటారు. ఇదే నిజమైతే.. నిజంగా సోనూ సూద్ చేజేతులో ఒక గెల్డెన్ ఛాన్స్ ని వదులుకున్నట్టే! కాగా, చివరి సారిగా ఈ ‘రియల్’ హీరో ‘ఆచార్య’ సినిమాలో కనిపించాడు.