‘వరుణ్ డాక్టర్’, ‘కాలేజ్ డాన్’ చిత్రాలతో తెలుగులోనూ చక్కని గుర్తింపు తెచ్చుకున్నాడు తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్. అతను హీరోగా ‘జాతి రత్నాలు’ సినిమాతో బిగ్గెస్ట్ సక్సెస్ అందుకున్న దర్శకుడు అనుదీప్ కేవి దర్శకత్వంలో తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం శర వేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. స్వర్గీయ నారాయణ్ దాస్ నారంగ్, సురేష్ బాబు, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా, అరుణ్ విశ్వ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఈ సినిమా టైటిల్ ఇంకా ఫిక్స్ చేయలేదు. ఇందులో ఉక్రెయిన్ మోడల్ మరియా ర్యాబోషప్క హీరోయిన్ గా నటిస్తోంది. భారతదేశంలోని పాండిచ్చేరి, బ్రిటన్‌లోని లండన్ నేపథ్యంలో సాగే ఈ మూవీలో సత్యరాజ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా నిర్మాతలు ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేశారు. తెలుగు, తమిళ భాషల్లో వినాయక చవితి కానుకగా ఆగస్ట్ 31న మూవీని విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. విశేషం ఏమంటే అదే రోజున సూర్య సమర్పణలో కార్తీ హీరోగా నటించిన ‘విరుమాన్’ చిత్రం సైతం రిలీజ్ కాబోతోంది. సో… ఇద్దరు తమిళ యంగ్ స్టార్ హీరోలు వినాయక చవితి రేస్ లో నిలువబోతున్నారు!