Sitharamam – Bimbisara: చాలా రోజుల తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలలో థియేటర్లు కళకళలాడటం కనిపిస్తోంది. దానికి కారణం కథాబలం ఉన్న రెండు చిత్రాలు శుక్రవారం జనం ముందుకు రావడమే! అందులో ఒకటి ప్రతిష్ఠాత్మక వైజయంతి మూవీస్ బ్యానర్ నిర్మించిన ‘సీతారామం’ కాగా, మరొకటి వైజయంతి మూవీస్ బ్యానర్ కు ఆ పేరు పెట్టిన ఎన్టీయార్ మనవడు కళ్యాణ్ రామ్ హీరోగా నటించి, నిర్మించిన ‘బింబిసార’ కావడం. ‘సీతారామం’ను క్లాస్ ఆడియెన్స్ మెచ్చుకుంటుంటే, ‘బింబిసార’ను మాస్ ఆడియెన్స్ ఆదరిస్తున్నారు. దాంతో ఓవర్ ఆల్ గా చాలా కేంద్రాలలో ‘సీతారామం’ కంటే ‘బింబిసార’కు బెటర్ ఓపెనింగ్స్ వచ్చాయి. ఈ రోజు వరలక్ష్మీ వ్రతం ఉండటంతో మహిళల సందడి థియేటర్లలో తక్కువగా ఉందని పలువురు ఎగ్జిబిటర్స్ చెబుతున్నారు. ‘సీతారామం’ లాంటి ఎపిక్ లవ్ స్టోరీ జనానికి రీచ్ కావడానికి కొంత సమయం పడుతుందని, పైగా దుల్కర్ సల్మాన్ కు తెలుగు రాష్ట్రాలలో థియేటర్ కు జనాలను తీసుకొచ్చేంత ఇమేజ్ లేదని అంటున్నారు. బెటర్ టాక్ తో ‘సీతారామం’ మూవీ సైతం నిదానంగా పికప్ కావడం ఖాయమనేది వారు చెబుతున్న మాట.
హను రాఘవపూడి మదిలో మెదిలిన ‘సీతారామం’ కథను సీనియర్ నిర్మాత అశ్వినీదత్ ఎక్కడా రాజీ పడకుండా భారీ ఎత్తున తెరకెక్కించారు. తెలుగు సినీ ప్రముఖులంతా ఈ మూవీని ఓన్ చేసుకుని, రిలీజ్ కు ముందు బాగా ప్రమోట్ చేశారు. దాంతో ఈ సినిమాకు కూడా డీసెంట్ ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ మూవీ క్లాస్ గా ఉందనే టాక్ ఎక్కువగా వినిపిస్తోంది. దీనిని అధిగమించి మౌట్ టాక్ స్ప్రెడ్ అయితే… ఈ మూవీ సైతం చక్కని విజయాన్ని నమోదు చేసుకునే ఛాన్స్ ఉంది. ‘సీతారామం’ తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లోనూ విడుదల కావడం దానికి కలిసొచ్చే అంశం. దుల్కర్ సల్మాన్ మల్లూవుడ్ లో స్టార్ స్టేటస్ ఉన్న హీరో. సో… కేరళలో ఈ చిత్రానికి తెలుగులో కంటే బెటర్ సక్సెస్ దక్కే ఛాన్స్ ఉంది.
ఇక వశిష్ఠ ఉరఫ్ వేణు తెరకెక్కించిన తొలిచిత్రం ‘బింబిసార’. ఈ కథను నమ్మిన వశిష్ట… కళ్యాణ్ రామ్ తోనే దీనిని తీయాలని కొన్నేళ్ళుగా పట్టుబట్టి కూర్చున్నాడు. అతనిలోని అంకిత భావం నచ్చి కళ్యాణ్ రామ్ చివరకు తానే ఈ సినిమాను నిర్మించాడు. ఎక్కడా రాజీ పడకుండా విజువల్ గ్రాండియర్ గా ఈ మూవీని నిర్మించడంతో ఇవాళ… మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. దాంతో వీలైనంత త్వరగా దీనికి సీక్వెల్ తీయాలని కళ్యాణ్ రామ్ భావిస్తున్నాడు. మొత్తం మీద ఈ శుక్రవారం విడుదలైన ఈ రెండు సినిమాలు తెలుగు చిత్రసీమలో కొత్త ఆశలను చిగురింపచేశాయి. మరి ఈ ఉత్సాహంతో అయినా… నిర్మాతలు షూటింగ్స్ ను తిరిగి ప్రారంభిస్తారేమో చూడాలి.