ఆగస్ట్ 5వ తేదీ జనం ముందుకు వచ్చిన ‘సీతారామం’ చిత్రానికి ప్రేక్షకాదరణతో పాటు విమర్శకుల ప్రశంసలూ దక్కాయి. విశేషం ఏమంటే… నిదానంగా అందుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ బరిలో స్టేబుల్ కలెక్షన్స్ తో సూపర్ హిట్ దిశగా సాగిపోయింది. ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఆగస్ట్ 5న విడుదల కాగా, కాస్తంత ఆలస్యంగా హిందీలో సెప్టెంబర్ 2న రిలీజ్ అయ్యింది. దక్షిణాది రాష్ట్రాల ప్రేక్షకులను థియేటర్లలో అలరించిన ‘సీతారామం’ ఇప్పుడు ఓటీటీలోనూ అందుబాటులోకి రాబోతోంది. ఈ నెల 9వ తేదీన తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ చేయబోతోంది. సినిమా విడుదలైన ఐదు వారాల తర్వాత ఇది ఓటీటీలో వస్తున్నట్టు.
గడిచిన నాలుగు వారాల్లో ఈ మూవీ ఎనభై కోట్లకు పైగా గ్రాస్ ను ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దుల్కర్ సల్మాన్, మృణాళ్ ఠాగూర్, రశ్మిక మండణ్ణ, సుమంత్ కీలక పాత్రలు పోషించిన ‘సీతారామం’ వారందరి కెరీర్ లో మైల్ స్టోన్ మూవీగా నిలిచిపోయింది. దర్శకుడు హను రాఘవపూడి, నిర్మాత అశ్వినీదత్ సైతం ఈ విజయం పట్ల పూర్తి స్థాయిలో సంతృప్తిని వ్యక్తం చేశారు. రేపు 9వ తేదీ తర్వాత ఓటీటీ లో చూసి వీక్షకులు ఇంకెంతగా స్పందిస్తారో చూడాలి.