Life Of Muthu: బ్లాక్ బస్టర్ అంచనాల మధ్య తెలుగులో విడుదల కానున్న శింబు ‘లైఫ్ ఆఫ్ ముత్తు’గురించే టాలీవుడ్ హాట్ డిబేట్ నడుస్తోంది. ఇప్పటికే తమిళ్ లో హిట్ టాక్ అందుకోవడంతో తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకోవచ్చని అంటున్నారు. సూపర్ హిట్ కాంబినేషన్ తమిళ స్టార్ హీరో శింబు, స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ వెందు తనిందదు కాడు’ సినిమాతో హ్యాట్రిక్ హిట్ ను అందుకున్నారు. గురువారం విడుదలైన ఈ చిత్రంలో శింబు ఒక కాటి కాపరి స్థాయి నుంచి గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగే పాత్రను పోషించారు. ఆకట్టుకునే కథ, కట్టిపడేసే యాక్షన్, ఎమోషన్ మరియి అద్భుతమైన నటనతో ఈ చిత్రం పూర్తి స్థాయి పాజిటివ్ రివ్యూలని అందుకుంటుంది. ఇటీవల వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన ‘మానాడు’తో ఫ్లాప్ ట్రాక్ కి ఫుల్ స్టాప్ పెట్టిన శింబు ఈ చిత్ర విజయంతో పూర్తి ఫామ్ లోకి వచ్చినట్టు కనపడుతుంది.
ఇక ఈ చిత్రం తెలుగులో ‘లైఫ్ ఆఫ్ ముత్తు’ పేరుతో స్రవంతీ మూవీస్ వారు గురువారమే రిలీజ్ చేయాల్సింది కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల శనివారానికి వాయిదా వేసారు. తెలుగులో ఇదివరకు మంచి మార్కెట్ ఉన్న హీరో శింబు, దర్శకుడు గౌతమ్ మీనన్ చిత్రాలు మధ్యలో గాడి తప్పిన విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక కొంత విరామం తరువాత చేసిన ఈ సినిమా పై తెలుగులోనూ భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే బుకింగ్స్ మంచి ఓపెనింగ్ రాబట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో శింబు సరసన సిద్దీ ఇధ్నానీ నటించగా.. రాధికా శరత్ కుమార్ మరియు మలయాళ నటుడు నీరజ్ మాధవ్ ముఖ్య పాత్రలు పోషించారు. ఏ.ఆర్ రెహమాన్ అద్భుతమైన స్వరాలందించాడు. మరి ఈ సినిమాతో ఈ కాంబో పూర్వ వైభవాన్ని అనుకోనున్నారా..? లేదా ..? చూడాలి.