విశాల నేత్రాలు, చక్కటి వర్చస్సు, చూడగానే చూపరులను ఆకట్టుకొనే రూపం, అందుకు తగ్గ అభినయం, ఆ రూపానికి తగిన లావణ్యం, దానిని ప్రదర్శిస్తూ సాగే నాట్యం అభినేత్రి శోభనను అందరి మదిలో చోటు సంపాదించుకొనేలా చేశాయి. మళయాళ సీమలో పుట్టినా, తెలుగు చిత్రసీమలో రాణించిన వారెందరో ఉన్నారు. వారిలో నటి, నర్తకి శోభన స్థానం ప్రత్యేకమైనది. తెలుగు చిత్రాలతోనే శోభన మంచి వెలుగు చూశారని చెప్పవచ్చు. నాట్యకళకే అంకితమై దేశవిదేశాల్లో ప్రదర్శనలిస్తూ నేడు ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించిన శోభనకు తెలుగునాట విశేషమైన ఆదరణ ఉంది.
శోభన 1970 మార్చి 20న త్రివేండ్రంలో జన్మించారు. ట్రావెన్ కోర్ సిస్టర్స్ గా పేరొందిన నటీమణులు లలిత, పద్మిని, రాగిణికి శోభన మేనకోడలు. రెండేళ్ళ ప్రాయంలో రాజేశ్ ఖన్నా ‘అమర్ ప్రేమ్’ లో ఓ సీన్ లో అలా కొన్ని క్షణాలు మాత్రమే తెరపై కనిపించారు శోభన. ఆ తరువాత పన్నెండేళ్ళ వయసులో మహానటి భానుమతీ రామకృష్ణ దర్శకత్వంలో అందరూ పిల్లలతో రూపొందిన ‘భక్త ధ్రువ మార్కండేయ’ తెలుగు సినిమాలోనే తొలిసారి శోభన నటించారు. ఆ తరువాత పలు భాషల్లో నటించినా, నాగార్జున హీరోగా రూపొందిన తొలి చిత్రం ‘విక్రమ్’తోనే శోభన కూడా నాయికగా తెలుగువారి ముందు నిలిచారు. అంతకు ముందు కొన్ని అనువాద చిత్రాల ద్వారా శోభన తెలుగువారికి పరిచయమైనా, ‘విక్రమ్’ శోభన హీరోయిన్ గా నటించిన తొలి తెలుగు చిత్రంగా నిలచింది. శోభన పలు తెలుగు చిత్రాలలో తనదైన అభినయంతో ఆకట్టుకున్నారు.
చిరంజీవి మొట్టమొదటి సొంత సినిమా ‘రుద్రవీణ’లో శోభన నాయికగా నటించారు. ఆ సినిమా అవార్డులు దక్కించుకుంది. ఇక ‘రౌడీ అల్లుడు’లోనూ చిరంజీవితో శోభన జోడీకట్టారు. బాలకృష్ణ సరసన శోభన నటించిన “మువ్వగోపాలుడు, నారీ నారీ నడుమ మురారి” చిత్రాలు మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. ‘నిప్పురవ్వ’ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ లో బాలయ్యతో చిందేసి కనువిందు చేశారు శోభన. నాగార్జున సరసన “నేటి సిద్ధార్థ, రక్షణ” చిత్రాలలోనూ హీరోయిన్ గా నటించారు శోభన. వెంకటేశ్ జోడీగా “అజేయుడు, త్రిమూర్తులు”లో అభినయించారు. మోహన్ బాబు సరసన శోభన నటించిన “అల్లుడుగారు, రౌడీగారి పెళ్ళాం” జనాన్ని మురిపించాయి. వీరితోనే కాకుండా హీరో కృష్ణ, రాజేంద్రప్రసాద్, భానుచందర్, కార్తీక్ వంటి వారితోనూ శోభన నటించిన తెలుగు సినిమాలు జనాన్ని ఆకట్టుకున్నాయి. ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రలు నచ్చితే నటించడానికి శోభన వెనుకాడడం లేదు. ఆ మధ్య మోహన్ బాబు ‘గేమ్’ సినిమాలో నటించారు శోభన.
సినిమాల్లో తన హవా తగ్గు ముఖం పట్టే సమయంలోనే శోభన ఓ నిర్ణయం తీసుకున్నారు. తనకు ఎంతో ఇష్టమైన నాట్యకళకు ఇక తన జీవితాన్ని అంకితం చేయాలని నిశ్చయించారు. అప్పటి నుంచీ నాట్యకళారాధనలో సాగిపోతున్నారామె. దేశవిదేశాల్లో తన భరతనాట్య ప్రదర్శనలతో జనాన్ని మురిపించారు శోభన. ఎందరో ప్రముఖ సంగీత, నాట్య కళాకారులతో కలసి ప్రదర్శనలిచ్చారు శోభన. 1994లో ‘కళార్పణ’ పేరుతో ఓ నాట్య శిక్షణాలయాన్ని చెన్నైలో ప్రారంభించారు. ఈ నాట్యపాఠశాలలో శాస్త్రీయ నృత్యంలో ఎందరికో శిక్షణ ఇస్తున్నారు. 2006లో శోభనకు ‘పద్మశ్రీ’ పురస్కారం లభించింది. యాభై రెండేళ్ళు నిండినా ఇప్పటికీ ప్రతి రోజూ భరతనాట్య సాధన చేస్తూనే ఉన్న శోభన మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆశిద్దాం.