డాక్టర్ రాజశేఖర్, జీవిత దంపతుల పెద్ద కుమార్తె శివానీ ఫెమినా మిస్ ఇండియా రేస్ లో ఉన్న విషయం తెలిసిందే! ఏప్రిల్ 30వ తేదీ జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలలో మిస్ తమిళనాడుగా శివానీ రాజశేఖర్ ఎంపికైంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా పోటీ పడుతున్న 31 మంది మిస్ ఇండియా కంటెస్టెంట్స్ లో ఆమె కూడా ఒకరు. అయితే హైదరాబాద్ లో ఉండే శివానీ రాజశేఖర్ తమిళనాడు నుండి ఈ పోటీలో పాల్గొనడం ఏమిటనే సందేహాన్ని గత మూడు, నాలుగు రోజులుగా కొందరు వ్యక్తం చేస్తున్నారు. దీనికి ‘శేఖర్’ మూవీ ట్రైలర్ లాంచ్ వేదికపై శివానీ వివరణ ఇచ్చింది.
తెలంగాణాలో ఉంటున్న తాను ఈ రాష్ట్రం నుండే పోటీలో పాల్గొన్నాలనుకున్నానని తెలిపింది. అయితే నిర్వాహకులు మల్టిపుల్ ఛాయిస్ ఇవ్వడంతో తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రపదేశ్ తో పాటు తాను జన్మించిన తమిళనాడునూ అప్లికేషన్ లో రాశానని తెలిపింది. పోటీ నిర్వాహకులు తనను తమిళనాడు కేటగిరి నుండి ఎంపిక చేశారని, అందువల్ల ‘మిస్ తమిళనాడు’గా ఎంపికయ్యానని చెప్పింది. ఓ తెలుగు అమ్మాయిగా ఈ రెండు రాష్ట్రాల నుండి తనను ఎంపిక చేసి ఉంటే మరింత సంతోషపడే దాన్నని, తమిళనాడు కూడా తనకు సొంత రాష్ట్రం వంటిదేనని తెలిపింది. అన్నింటినీ మించి తాను భారత దేశాన్ని రిప్రజెంట్ చేయడాన్ని గర్వంగా భావిస్తానని చెప్పింది.