Shiva Rajkumar: కన్నడ చలన చిత్ర పరిశ్రమలో శివ రాజ్‌కుమార్ ఒక ఐకానిక్ హీరో. శివ రాజ్‌కుమార్ నటించిన తాజా చిత్రం ‘వేద’. గత యేడాది డిసెంబర్ నెలాఖరులో ఈ సినిమా కన్నడ నాట జనం ముందుకు వచ్చింది. శివరాజ్ కుమార్ నటించిన 125వ చిత్రం ఇది. విశేషం ఏమంటే… శివరాజ్ కుమార్ భార్య గీత నేతృత్వంలో ‘గీతా పిక్చర్స్’ బ్యానర్ పై వచ్చిన సినిమా ఇది. ఇప్పుడీ సినిమాను అదే పేరుతో తెలుగులోనూ డబ్ చేసి విడుదల చేయబోతున్నారు.
కంచి కామాక్షి కలకత్తా కాళీ క్రియేషన్స్ ద్వారా ఈ సినిమా తెలుగులో రిలీజ్ కానుంది. దీనికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ ను ఆవిష్కరించింది చిత్ర బృందం. ఎ. హర్ష దర్శకత్వం వహించిన ఈ పిరియాడికల్ యాక్షన్ డ్రామాలో ఘనవి లక్ష్మణ్, అదితి సాగర్, శ్వేత చంగప్ప, ఉమాశ్రీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. 1960 నేపథ్యంలో తెరకెక్కిన ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామా తెలుగులోనూ చక్కని విజయాన్ని సాధిస్తుందనే నమ్మకాన్ని నిర్మాతలు వ్యక్తం చేస్తున్నారు.