Shatamanam Bhavati: యంగ్ హీరో శర్వానంద్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ వీబ్లాక్ బస్టర్ హిట్ అంటే శతమానంభవతి అని చెప్పడంలో ఎంటువంటి అతిశయోక్తి లేదు. నేషనల్ అవార్డు అందుకున్న ఈ సినిమాలో శర్వా నటన వేరే లెవెల్ అంతే. సతీష్ వేగేశ్న దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించాడు. ఇక శర్వా సరసన అనుపమ పరమేశ్వరన్ నటించింది. ప్రేమలు, ఆప్యాయతలు.. తల్లిదండ్రుల ప్రేమ.. పెద్దల కోసం తమ ప్రేమను వదులుకొనే అద్భుతమైన జంట. అచ్చ తెలుగు సంక్రాంతికి మరో అర్ధం అంటే.. ఈ సినిమా ని చెప్పొచ్చు. 2017 సంక్రాంతికి వచ్చి సూపర్ హిట్ అందుకున్న శతమానంభవతి సినిమా ఆ సీజన్ లో రిలీజైన రెండు పెద్ద సినిమాల మధ్య మంచి హిట్ అందుకుంది. ఇప్పటికీ సంక్రాంతికి అసలైన సినిమా ఏది అంటే.. శతమానంభవతి అని చెప్పుకొచ్చేస్తారు. దాదాపు ఏడేళ్ల తరువాత శతమానంభవతికి సీక్వెల్ ప్రకటించాడు దిల్ రాజు. ఈ సీక్వెల్ కు కూడా సతీష్ వేగేశ్ననే దర్శకత్వం వహించనున్నట్లు తెలిపారు.
ఇక ఇక్కడివరకు ఓకే కానీ, ఈ సీక్వెల్ లో నటీనటులు ఎవరెవరు ఉంటారు అనేది ప్రేక్షకుల అనుమానం. హీరోయిన్, నటీనటులు మారినా కూడా సీక్వెల్ అంటే కచ్చితంగా హీరో ఉండాలి. కొన్ని సినిమాల్లో ఎవరు లేకపోయినా సీక్వెల్ అని తీసేస్తున్నారు. కానీ, ఆ సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి అనేది నమ్మదగ్గ నిజం. శతమానంభవతి సినిమా అంటే శర్వా.. శర్వా అంటే శతమానంభవతి అనేంతలా ప్రేక్షకుల మైండ్ లో నిలిచిపోయింది. కానీ, అందుతున్న సమాచారం ప్రకారం శర్వా.. ఈ సీక్వెల్ లో ఉండడు అని టాక్ నడుస్తోంది. శతమానంభవతి చివరిలో.. బావమరదళ్ళ పెళ్లి చేయకుండా ప్రకాష్ రాజ్.. వారికి నచ్చినప్పుడు పెళ్లి చేస్తాను అని చెప్పి మాట ఇస్తాడు. ఇక దానికి కంటిన్యూగా సినిమా ఉంటుందా.. ? లేక కొత్త కథను తీసుకువస్తారా.. ? అనేది తెలియాల్సి ఉంది. కానీ, శర్వా మాత్రం ఈ సీక్వెల్ లో నటించడం లేదు అన్నది పక్కా అని తెలుస్తోంది. ఈ విషయం తెలియడంతో సీక్వెల్ లో శర్వా కాకుండా వేరే హీరోనా.. మాకొద్దు.. ?అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.