Shah Rukh Khan: షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ సినిమా ఊహించిన దానికన్నామిన్నగా సాగుతోంది. త్వరలోనే వేయి కోట్ల క్లబ్ లో చోటు సంపాదించనుంది. అలాగే రూ.500 కోట్ల క్లబ్ లో చోటు సంపాదించిన తొలి హిందీ సినిమాగానూ ‘పఠాన్’ నిలువబోతోంది. రాజమౌళి ‘బాహుబలి-2′ దారిదాపుల్లో నిలవడానికీ సిద్ధమయింది. ఈ నేపథ్యంలో షారుఖ్ ఖాన్ చిత్రాల్లో “ద బెస్ట్, ద వరస్ట్, అండర్ రేటెడ్ ఫిలిమ్, ఓవర్రేటెడ్ ఫిలిమ్” అనే నాలుగు విభాగాలు చేసి ఫ్యాన్స్ ఎవరికి వారు తమకు నచ్చిన ఉత్తమం, చెత్త’మం’ పోగేశారు. ఆశ్చర్య కరంగా షారుఖ్ కు ఊపిరి పోసిన ‘పఠాన్’ను కొందరు ఓవర్ రేటెడ్ గానూ, మరికొందరు అండర్ రేటెడ్ గానూ పేర్కొనడం విశేషం!
చాలామంది అభిమానులు షారుఖ్ చిత్రాలలో ‘చక్ దే ఇండియా’ను బెస్ట్ ఫిలిమ్ గా పేర్కొన్నారు. మరికొందరు ‘దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే’నూ మరచిపోలేదు. ‘కభీ ఖుషి, కభీ ఘమ్’ను కూడా కొందరు షారుఖ్ ఉత్తమ చిత్రంగా పేర్కొన్నారు. షారుఖ్ సినిమాల్లో చెత్తవి అన్నవిభాగంలో “హమ్ తుమ్హారే హై సనమ్, రామ్ జానే, హ్యాపీ న్యూ ఇయర్, కభి అల్విద నా కెహనా” మొదలైన వాటిని ఫ్యాన్స్ తెలిపారు. ఇక ఆయన ఉత్తమ చిత్రాల్లో ఎక్కువ మంది ‘చక్ దే…’కే ఓటేయగా, తరువాతి స్థానంలో ‘కభీ ఖుషి కభీ ఘమ్’నే నిలిపారు. ఇవన్నీ ఫ్యాన్స్ అభిప్రాయాలు కాగా, తన భర్త నటించిన చిత్రాలన్నీ తనకు ఉత్తమంగానే కనిపిస్తాయని గౌరీ ఖాన్ చెప్పడం కొసమెరుపు!