ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీమ్ తరఫున రెండు సార్లు వరల్డ్ వరల్డ్ కప్ కు కెప్టెన్ గా వ్యవహరించిన వ్యక్తి మిథాలీ రాజ్. ఈ మాజీ క్రికెటర్ జీవిత కథను తాప్సీ తో ‘శభాష్ మిథు’ పేరుతో తెరకెక్కించారు శ్రీజిత్ ముఖర్జీ. డిసెంబర్ 3వ తేదీ మిథాలీ రాజ్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ‘శభాష్ మిథు’ సినిమాను వచ్చే యేడాది ఫిబ్రవరి 4వ తేదీ విడుదల చేయబోతున్నారు. ఈ వార్త తెలిసిన వెంటనే మిథాలీ రాజ్ తన హర్షం వెలిబుచ్చారు. తన బయోపిక్ విడుదల తేదీని ప్రకటించడం ఎంతో ఆనందంగా ఉందని, దాన్ని మాటల్లో వ్యక్తం చేయలేనని మిథాలీ అన్నారు. ‘శభాష్ మిథు’ సినిమా రూపకల్పనలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
విశేషం ఏమంటే… ఇటీవలే తాప్సీ పన్ను నటించిన ‘రశ్మీ రాకెట్’ మూవీ విడుదలై చక్కని విజయాన్ని అందుకుంది. అందులో అథ్లెట్ గా నటించిన తాప్సీ ఇప్పుడు మిథాలీ రాజ్ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశారు. మిథాలీ రాజ్ భారతీయ మహిళ క్రికెట్ టీమ్ ను ఎలా లీడ్ చేశారు, స్టీరియో టైప్ ను ఎలా బ్రేక్ చేశారు అనేటు వంటి అంశాలు ఈ సినిమాలో ఉంటాయని తాప్సీ చెబుతోంది. అంతేకాదు… మిథాలీ రాజ్ కు ట్విట్టర్ ద్వారా బర్త్ డే విషెస్ చెబుతూ, ‘నేను క్రికెట్ ఆటడం కోసం పుట్టానో లేదో తెలియదు. కానీ స్క్రీన్ మీద నీ పాత్ర పోషిస్తూ, క్రికెట్ ఆడినందుకు సంతోషంగానూ, గర్వంగానూ ఉంది. ఈ జన్మకు ఇది చాలు’ అని పేర్కొంది.