సల్మాన్ సూపర్ హిట్ మూవీస్ లో ‘నో ఎంట్రీ’ సినిమా ఒకటి. సల్మాన్ తో పాటు అనిల్ కపూర్, ఫర్దీన్ ఖాన్ నటించిన ఈ మల్టీస్టారర్ 2005లో బాలీవుడ్ టాప్ హిట్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రానికి అనీస్ బజ్మీ దర్శకత్వం వహించారు. మోస్ట్ ఎంటర్ టైనింగ్ మూవీగా విజయం సాధించిన ఈ సినిమాకు సీక్వెల్ తీయాలని మేకర్స్ ఎప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. అది ఇప్పటి వరకూ కార్యరూపం దాల్చలేదు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ‘నో ఎంట్రీ’ సీక్వెల్ కి ముహూర్తం కుదిరిందట. అది వచ్చే ఏడాది సెట్స్‌పైకి రావచ్చని వినిపిస్తోంది. బాలీవుడ్ మీడియా కథనం ప్రకారం అనీస్ ఈ సీక్వెల్ కోసం లైన్ సిద్ధం చేశాడట. ప్రస్తుతం ఆ స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడు.
ఇక ఇందులో ఒరిజినల్ లో నటించిన సల్మాన్, ఫర్దీన్, అనిల్ తమ పాత్రలను కంటిన్యూ చేస్తారట. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ సీక్వెల్ లో ఒక్కో హీరోకి జోడీగా ముగ్గురు హీరోయిన్లు నటించబోతున్నారట. సో మొత్తం తొమ్మిది మంది హీరోయిన్స్ ఉంటారన్నమాట. ఒరిజినల్ లో నటించిన బిపాసా బసు, లారా దత్తా, ఈషా డియోల్‌తో మేకర్స్ చర్చలు జరిపారట. మిగిలిన హీరోయిన్స్ వేటలో ఉన్నారట. సీక్వెల్ ఒరిజినల్ కంటే ఎక్కువ సరదాగా ఉంటుందని యూనిట్ చెబుతోంది. వచ్చే ఏడాది సెట్స్ పైకి తీసుకువెళ్లి ఆ తర్వాత ఏడాది విడుదల చేస్తామని మేకర్స్ అంటున్నారు. మరి ‘నో ఎంట్రీ’ లాగే సీక్వెల్ ‘నో ఎంట్రీ మే ఎంట్రీ’ కూడా ప్రేక్షకాదరణకు నోచుకుంటుందేమో చూడాలి.