ఆ రోజుల్లో అందాలనటిగా రాజ్యమేలిన బి.సరోజాదేవి తెరపై కనిపిస్తే చాలు అభిమానుల మది ఆనందంతో చిందులు వేసేది. చిలుక పలుకులు వల్లిస్తూ, నవ్వులు చిందిస్తూ చూపరులను ఇట్టే ఆకట్టుకొనే రూపంతో తెలుగు చిత్రసీమలో తనదైన బాణీ పలికించారు బి.సరోజాదేవి. కన్నడసీమలో పుట్టిన సరోజాదేవి తెలుగు పదాలను పట్టి పట్టి పలికేవారు. అయినా అది ఆమె బాణీగా భాసిల్లింది. ఆ ముద్దుమోములో పలికే తెలుగు పలుకు మరింత ముద్దుగా ఉండేదని ఆ నాటి అభిమానులు ఈ నాటికీ గుర్తు చేసుకుంటారు.
బైరప్ప సరోజాదేవి 1938 జనవరి 7న బెంగళూరులో జన్మించారు. ఆమె తండ్రి బైరప్ప కూతురును లలితకళల్లో ప్రోత్సహించారు. చిన్నతనంలోనే తండ్రి కోరిక మేరకు నాట్యం అభ్యసించారు సరోజాదేవి. హొన్నప్ప భాగవతార్ నటించి, రూపొందించిన ‘మహాకవి కాళిదాస’ అనే కన్నడ చిత్రంతో సరోజాదేవి పరిచయమయ్యారు. వరుసగా కొన్ని కన్నడ చిత్రాల్లో నటించిన తరువాత ఓ తమిళ సినిమాలోనూ సరోజా అందం మురిపించింది. ఆ తరువాత యన్టీఆర్ తన సొంత చిత్రం ‘పాండురంగ మహాత్మ్యం’ తో తెలుగు తెరకు సరోజాదేవిని పరిచయం చేశారు. నాటి మేటి హీరోలయిన యన్టీఆర్, ఏయన్నార్, ఎమ్జీఆర్, శివాజీగణేశన్, రాజ్ కుమార్ అందరి సరసన దక్షిణాదిన సందడి చేసిన సరోజాదేవి ఉత్తరాది చిత్రాల్లోనూ మురిపించారు. మరో అందాల తార వైజయంతీమాల పోలికలు ఉండడంతో వారిద్దరినీ అక్కాచెల్లెళ్ళుగా భావించారు హిందీ సినిమా జనం. తెలుగులో రామారావు, నాగేశ్వరరావు సరసన సరోజాదేవి నటించిన అనేక చిత్రాలు జనాన్ని విశేషంగా అలరించాయి. ఏయన్నార్ తో “పెళ్ళి కానుక, శ్రీకృష్ణార్జున యుద్ధం, ఆత్మబలం, రహస్యం, అమరశిల్పి జక్కన్న” వంటి చిత్రాలలో నాయికగా నటించారు. ముఖ్యంగా ‘పెళ్ళికానుక’ నటిగా మంచి మార్కులు సంపాదించి పెట్టింది.
నందమూరి చిత్రాలతోనే సరోజాదేవి తెలుగునాట ఓ వెలుగు వెలిగింది అంటే అతిశయోక్తి కాదు. యన్టీఆర్ తొలిసారి దర్శకత్వం వహించిన ‘సీతారామకళ్యాణం’లో మండోదరి పాత్రలో నటించి మెప్పించారామె. ఆ తరువాత రామారావుతో “జగదేకవీరుని కథ, ఇంటికి దీపం ఇల్లాలే, మంచి-చెడు, దాగుడుమూతలు, ప్రమీలార్జునీయం, శకుంతల, భాగ్యచక్రం, ఉమాచండీగౌరీ శంకరుల కథ, విజయం మనదే, మాయని మమత, మనుషుల్లో దేవుడు, శ్రీరామాంజనేయ యుద్ధం, దానవీరశూరకర్ణ” చిత్రాలలో నటించారు. యన్టీఆర్ దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం ‘సీతారామకళ్యాణం’లోనూ, ఆయన చివరి సారిగా దర్శకత్వం వహించిన ‘సమ్రాట్ అశోక’లోనూ సరోజాదేవి నటించడం విశేషం.
తెలుగు కన్నా మిన్నగా మాతృభాష కన్నడలోనూ, తమిళంలోనూ సరోజాదేవి నటించారు. ఆమె చిత్రసీమకు చేసిన సేవలకు గాను 1969లో పద్మశ్రీ, 1992లో పద్మభూషణ్ పురస్కారాలు అందుకున్నారు. 2009 సంవత్సరానికి గాను యన్టీఆర్ నేషనల్ అవార్డు తో ఆంధప్రదేశ్ ప్రభుత్వం సరోజాదేవిని గౌరవించింది. ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రల్లో నటించడానికి ఆమె సిద్ధంగా ఉన్నారు. ఈ నాటికీ ఆ నాటి అభిమానుల మదిలో అందాలతారగానే నెలకొన్న సరోజాదేవి మరిన్ని వసంతాలు చూస్తూ ఆనందంగా సాగిపోవాలని ఆశిద్దాం.