‘గంగూబాయ్ కథియావాడి’ సినిమా విడుదలను నిలిపివేయాలని కోరుతూ సుప్రీమ్ కోర్టులో వేసిన కేసు వీగిపోయింది. గంగూబాయి పెంపుడు కొడుకునంటూ షా అనే వ్యక్తి చేసిన అభ్యర్థనను సుప్రీమ్ కోర్టు గురువారం తిరస్కరించింది. తన తల్లి గౌరవానికి భంగం కలిగించేలా సినిమాలోని సన్నివేశాలు ఉన్నాయని, దాని విడుదలపై స్టే ఇవ్వాలని, లేదంటే పేరు మార్చాలని కోరిన షా వాదనను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. చిత్ర దర్శక నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ తరఫున కోర్టులో లాయర్ ఎ. సుందరమ్ వాదిస్తూ, ‘సినిమా విడుదలకు ఒక రోజు ముందు పేరు మార్చడం అనేది సాధ్యం కాదని, ఇప్పుడు పరిస్థితి తమ చేతులు దాటి వెళ్ళిపోయింద’ని కోర్టుకు విన్నవించారు. పైగా పిటీషనర్ షా… గంగూబాయ్ పెంపుడు కొడుకు అని చెప్పే ఆధారాలేవీ లేవని, కేవలం రేషన్ కార్డు తప్ప మరో ఆధారాన్ని అతను చూపించడం లేదని తెలిపారు. అయినా ఒక వ్యక్తి మరణించిన నలభై సంవత్సరాల తర్వాత వస్తున్న సినిమా వారి గౌరవానికి భంగం కలిగిస్తుందని అభియోగం మోపడం కూడా సరికాదని అన్నారు.
Read Also : Kajal Aggarwal : రెండవ బిడ్డ ఆన్ ది వే… నిషా స్పెషల్ పోస్ట్
ఈ సినిమాలో గంగూబాయి అనే పాత్రను ఉన్నతంగానే దర్శకుడు చూపించాడని, రెడ్ లైట్ ఏరియాకు చెందిన ఓ యువతి పోరాటయోధురాలిగా ఎలా మారిందో ఇందులో చూపించారని, ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచే సన్నివేశాలు ఇందులో లేవని అన్నారు. తన దర్శకుడు ‘ది మాఫీయా క్వీన్స్ ఆఫ్ బొంబే’ పుస్తకం ఆధారంగా ‘గంగూభాయ్’ చిత్రాన్ని రూపొందించారని, నిజానికి పిటీషనర్ కు అభ్యంతరం ఏదైనా ఉంటే ఆ పుస్తకంపై ఉండాలని, అప్పుడు మౌనం వహించి ఇప్పుడు సుప్రీమ్ కోర్టు తలుపు తట్టడం సబబు కాదని వాదించారు. అలానే హైకోర్టు ఈ కేసును ఆరు నెలల క్రితమే కొట్టివేసిందని, ఇంతకాలం తర్వాత ఇప్పుడు సుప్రీమ్ కోర్టుకు రావడం కూడా సమంజసంగా లేదని అన్నారు. గంగూబాయ్ కుటుంబ వారసుడిగా సరైన ఆధారాలను చూపించని కారణంగా ఈ కేసును సుప్రీమ్ కోర్టు తిరస్కరించింది. దాంతో రేపు ‘గంగూబాయ్ కథియావాడి’ మూవీ విడుదలకు లైన్ క్లియర్ అయినట్టే!