జాన్ అబ్రహమ్ ఒకటి కాదు రెండు కాదు మూడు పాత్రలు చేసిన సినిమా ‘సత్యమేవ జయతే -2’. 2018లో వచ్చిన ‘సత్యమేవ జయతే’ లైన్ లోనే ఈ సినిమా కూడా రూపుదిద్దుకుంది. అంతేకాదు… అంతకు మించి అన్నట్టుగా ఈ సినిమాను దర్శకుడు మిలాప్ జవేరీ తెరకెక్కించాడు. యాక్షన్, కరెప్షన్, పాలిటిక్స్, పోలీస్ పవర్, ఫార్మర్స్ ఇష్యూ…. ఇలా అనేక అంశాలను మోతాదుకు మించి ఈ సినిమా కథలో ఇమిడ్చారనే విషయం సోమవారం విడుదలైన ట్రైలర్ చూస్తే అర్థమైపోతోంది. జాన్ అబ్రహమ్ తండ్రిగా, ఇద్దరు కొడుకులుగా త్రిపాత్రాభినయం చేశాడు. అయితే కొడుకులిద్దరి భావాలూ వేర్వేరు అనేది ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. అయితే వీరిద్దరూ ఒక్కటై దేశానికి పట్టిన చీడను ఎలా తొలగించారనేది తెర మీద చూడాల్సింది. తెలుగులో ‘లవ్ టుడే’తో నటిగా మారిన దివ్య ఖోస్లా టీ సీరీస్ అధినేత భూషణ్ కుమార్ ను వివాహమాడిన తర్వాత దర్శకురాలిగా, నిర్మాతగా ఎంతో బిజీగా ఉంటోంది. అయితే ‘సత్యమేవ జయతే -2’తో మళ్ళీ వెండితెరపై ఆమె తన అదృష్టం పరీక్షించుకోబోతోంది. ఇక ఐటమ్ గర్ల్ గా గుర్తింపు తెచ్చుకున్న నోరా ఫతేహీ ఈ చిత్రంలోనూ డాన్స్ నంబర్ లో మెరిసింది. అనూప్ సోని, హర్ష ఛాయా, గౌతమీ కపూర్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ‘సత్యమేవ జయతే -2’ చిత్రం నవంబర్ 25న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతోంది.