Satya Dev Gets Nationalwide Recognition With Ram Setu: విభిన్నమైన సినిమాలు, పాత్రల్లో నటిస్తూ వెర్సటైల్ హీరోగా తనదైన గుర్తింపు సంపాదించుకున్నారు సత్యదేవ్. ఓ పక్క హీరోగా నటిస్తూనే అవకాశం చిక్కాలే కానీ అరుదైన పాత్రలనూ సత్యదేవ్ అందిపుచ్చుకుంటున్నాడు. ఈ నెలలో అతను నటించిన రెండు సినిమాలు జాతీయ స్థాయిలో విడుదలయ్యాయి. అందులో ఒకటి 5వ తేదీ వచ్చిన ‘గాడ్ ఫాదర్’ కాగా, మరొకటి 25న విడుదలైన ‘రామ్ సేతు’. చిరంజీవి హీరోగా నటించిన ‘గాడ్ ఫాదర్’ తెలుగు, హిందీ భాషల్లో ఒకేరోజున విడుదలైంది. ఇతర ప్రధాన భారతీయ భాషల్లో ఆ తర్వాత జనం ముందుకు వచ్చింది.
ఇక దీపావళి కానుకగా అక్షయ్ కుమార్ నటించిన ‘రామ్ సేతు’ హిందీలో రూపుదిద్దుకుని తెలుగుతో పాటు ఇతర భాషల్లో డబ్ అయ్యింది. అన్ని భాషల్లోనూ ఒకే రోజున రిలీజ్ అయ్యింది. ‘గాడ్ ఫాదర్’లో ప్రతినాయకుడిగా నటించి మెప్పించిన సత్యదేవ్, తాజా చిత్రం ‘రామ్ సేతు’లో గాడ్ ను గుర్తు చేసే పాత్రను పోషించాడు. అతను పోషించిన అంజనీ పుత్ర (ఏపీ) పాత్రను దర్శకుడు ఓ మిస్టీరియస్ క్యారెక్టర్ గా మలిచాడు. సినిమా చూసిన వారికి ఈ పాత్రలోని ఔచిత్యం ఏమిటనేది అర్థమౌతుంది. అలాంటి ఓ భిన్నమైన పాత్రను పోషించి జాతీయ స్థాయిలో చక్కని గుర్తింపు పొందాడు సత్యదేవ్. రాముడు నిర్మించినట్టు హిందువులు భావించే రామసేతు నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ఆర్కియాలజిస్ట్ గా అక్షయ్ కుమార్ నటించగా, అతనికి తోడుగా ఉండే పాత్రలను జాక్వలైన్ ఫెర్నాండెజ్, సుస్రత్ బరుచా చేశారు.
వీరితో పాటు శ్రీలంక గైడ్ గా సత్యదేవ్ పాత్ర ద్వితీయార్థంలో ఎంట్రీ ఇస్తుంది. నిజాయతీతో కూడా స్టోరీ లైన్, అక్షయ్ కుమార్ నటనతో పాటు సత్యదేవ్ నటనకు కూడా భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు, సినీ అభిమానులు ఫిదా అయ్యారు. సినిమాను చూసిన అభిమానులు, ఆడియెన్స్ ట్విట్టర్ సహా పలు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా సత్యదేవ్ అద్భుతంగా నటించాడని అప్రిషియేట్ చేస్తున్నారు. విశేషం ఏమంటే… ఐదేళ్ళ క్రితమే తెలుగు, హిందీ భాషల్లో రూపుదిద్దుకున్న ‘ఘాజీ’ మూవీలోనూ సత్యదేవ్ కీలకమైన పాత్ర పోషించి, ఉత్తరాది వారి ముందుకు నేరుగా వెళ్ళాడు.