ప్రామిసింగ్ ఆర్టిస్ట్ సత్యదేవ్ ఇప్పుడు పలు ప్రాజెక్ట్స్‌తో బిజీ బిజీగా ఉన్నాడు. విశేషం ఏమంటే… అతను నటిస్తున్న రెండు సినిమాలు వచ్చే నెలలో జనం ముందుకు రాబోతున్నాయి. అందులో ఒకటి ‘గాడ్సే’. గోపీ గణేశ్ దర్శకత్వంలో గతంలో సత్యదేవ్ ‘బ్లఫ్ మాస్టర్’ మూవీలో నటించాడు. ఇప్పుడీ ‘గాడ్సే’ సినిమాను వారిద్దరి కాంబినేషన్‌లో సి. కళ్యాణ్ నిర్మించారు. అవినీతిపరుడైన రాజకీయ నాయకుడిని, ఈ కుళ్ళు వ్యవస్థను ఒంటి చేత్తో ఎదుర్కొనే ధైర్యవంతుడైన యువకుడి పాత్రలో సత్యదేవ్ కనిపించబోతున్నాడు. హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా నటించింది. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘గాడ్సే’కు సూపర్ టాక్ వచ్చింది. ఈ నెల 20న ‘గాడ్సే’ను విడుదల చేయాలని నిర్మాత సి. కళ్యాణ్ తొలుత భావించినా, పబ్లిసిటీని మరింత పక్కాగా చేసి, వచ్చే నెల 17న మూవీని రిలీజ్ చేయాలని తాజాగా నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే… కన్నడంలో హిట్ అయిన ‘లవ్ మాక్‌టైల్’ మూవీ తెలుగు రీమేక్ ‘గుర్తుందా శీతాకాలం’లోనూ సత్యదేవ్ హీరోగా నటిస్తున్నాడు. ఇందులో తమన్నా, మేఘా ఆకాశ్, కావ్యశెట్టి, ప్రియదర్శి కీలక పాత్రలు పోషించారు. నాగశేఖర్ దర్శకత్వం వహించిన ఈ మూవీని కూడా నిర్మాతలు వచ్చే నెలలోనే విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. సో… వచ్చే నెలలో సత్యదేవ్ నటించిన భిన్నమైన కథాంశాలున్న సినిమాలు రెండు కొద్ది రోజుల గ్యాప్‌తోనే జనం ముందుకు రాబోతున్నాయి. ఇదిలా ఉంటే.. హిందీలోనూ అక్షయ్ కుమార్ ‘రామ్ సేతు’లో సత్యదేవ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అలానే చిరంజీవి ‘గాడ్ ఫాదర్’లోనూ, కొరటాల శివ సమర్పణలో నిర్మితమవుతున్న సినిమాలోనూ, శరణ్ కొప్పిసెట్టి దర్శకత్వంలో ‘ఫుల్ బాటిల్’ మూవీలోనూ సత్యదేవ్ నటిస్తున్నాడు.