‘ఆహా’లో స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు నిర్వహించిన ‘Sarkar ‘gameషోకు అప్పట్లో చక్కని స్పందన లభించింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని అగస్త్య ఆర్ట్స్ సంస్థ ఇప్పుడు సీజన్ 2కు రంగం సిద్ధం చేసింది. ఏప్రిల్ 29 నుండి ప్రతి శుక్రవారం సాయంత్రం 6.00 గం.లకు ఈ గేమ్ షో ప్రసారం కానుంది. రెట్టించిన థ్రిల్, రెట్టించిన ఎగ్జయిట్ మెంట్, రెట్టించిన ఎంటర్ టైన్ మెంట్ తో ఈ రియాలిటీ షో ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. ప్రతి ఎపిసోడ్ నాలుగు రౌండ్స్ తో సాగబోతోంది. అలానే ఆడియెన్స్ కూ కొన్ని ప్రశ్నలను సంధించి, వారిలో లక్కీ పర్శన్ కు గిఫ్ట్ హ్యాంపర్ ను ఇవ్వబోతున్నారు. పాలిటిక్స్, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, మైథాలజీకి సంబంధించిన ప్రశ్నలకు వ్యూవర్స్ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. రాబోయే శుక్రవారం స్ట్రీమింగ్ కాబోతున్న సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్ లో ‘డీజే టిల్లు’ హీరో సిద్ధు జొన్నలగడ్డతో పాటు అతని తండ్రిగా నటించిన మురళీధర్, అలానే ‘మార్కస్’ ఫేమ్ ప్రణీత్ రెడ్డి, దీపిక పిల్లి పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పటికే సోషల్ మీడియాలో హంగామా సృష్టిస్తోంది. ‘సర్కార్’ సీజన్ 2లో మోర్ ఫన్ ను అందించడం కోసం ప్రదీప్ మాచిరాజు స్టాండప్ కామెడీ చేయబోతున్నాడు.